బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. మోడీ, ఈడీ, బోడీలకు భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం పిట్లంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, మోడీపై ధ్వజమెత్తారు.
” తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ. ఎవరికీ భయపడం. ప్రజాకోర్టులోనే అన్నీ తేల్చుకుంటాం.ఎవరు తప్పు చేశారన్నది 2023లో ప్రజలే తమ తీర్పు ద్వారా చెబుతారు. మన దేశంలో మోదీ అనే మహా నటుడు ఉన్నాడు. ఆయన్ను ఆస్కార్ పంపింతే మనకు మరో అవార్డు వచ్చేది. అబద్దాలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చారు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తుల ఖాతాలో వేస్తున్నారు. ఆదాయం రెట్టింపు చేస్తానన్న ఆయన మాటలు నిజంకాలేదు. రైతుల ఆదాయం డబుల్ అవ్వలేదు. ఏడాదికి ఇస్తానన్న 2 కోట్లు ఉద్యోగాల ఊసేలేదు. నల్లధనం తెస్తానన్నారు కదా అని అడిగితే తెల్ల మోహం వేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.115 చేసింది. గ్యాస్ సిలిండర్ ధర రూ.400నుంచి రూ.1200కు పెంచింది. అన్ని నిత్యావసరాల ధరలు పెంచి పేదల మీద భారం మోపింది” అని మోడీపై కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు కేటీఆర్. ఏం చేయని వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో భారాసను గెలిపించి.. తిరిగి కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేసిందని తెలిపారు.