ఏపీలో మళ్లీ ఫోన్ల లారీ లూటీ.. కోటి సరుకు మాయం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మళ్లీ ఫోన్ల లారీ లూటీ.. కోటి సరుకు మాయం.. 

September 16, 2020

Mobil phones container looted in Guntur district

మారుతున్న కాలానికి తగ్గట్లు దొంగలు కూడా కొట్టేసే సరుకు మారుస్తున్నారు. బంగారం కంటే సెల్ ఫోన్లే బెటర్ అంటున్నారు. ఇటీవల చిత్తూరు సరిహద్దులో మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్న లారీ దోపిడీని మరిచిపోకముందే ఏపీలో మరో లారీలోని సరుకు మాయమైంది. గుంటూరు జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ డోర్ తెరిచి సరుకు మాయం చేశారు. విషయం తెలియని డ్రైవర్, కండక్టర్ తర్వాత లబోదిబోమన్నారు. కాజ టోల్‌గేట్ వద్ద మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు  సరుకు తీసుకొస్తున్న ఈ లారీలో 980 ఫోన్లను దండుగులు కొట్టేశారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనదారుడు కంటైనర్‌ను ఆపి విషయం చెప్పారు. లూటీకి గురైన సరుకు విలువ కోటి వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గుంటూరు పోలీసులు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ దొంగల ముఠా ఈ పనికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.  గత నెల చిత్తూరు జిల్లా నగరి సమీపంలో దొంగలు ఫోన్ల లారీని అడ్డుకుని రూ. 6 కోట్ల విలువైన సరుకును ఎత్తుకెళ్లారు.