స్మార్ట్ఫోన్ కొనేస్తాం అన్నంత బిల్డప్ ఇస్తూ షాపులకు వెళ్లి ఫోన్లను దొంగిలించి అడ్డంగా సీసీ కెమెరాలకు చిక్కుతున్న ఘటనలు తెలిసినవే. కొందరు గోడలు, షెటర్లు బద్దలు కొట్టి ఫోన్ల షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలా ఒకటీ అరా దొంగతనాలు చేయడమొందుకు అని భావించిన కేటుగాళ్లు ఏకంగా ముబైళ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కుకే సూటిపెట్టి హైజాక్ చేశారు. ఆ ట్రక్కులో ఉన్న రూ.15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లతో ఉడాయించారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు రూ.15 కోట్ల విలువైన 14 వేల 500 మొబైల్ ఫోన్ల లోడుతో ఉన్న కంటెయినర్ ట్రక్ చెన్నై నుంచి ముంబయి వెళ్తోంది.
పూనామ్పల్లిలోని రెడ్మీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నుంచి ఫోన్లను డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ ముంబైకి రవాణాచేస్తోంది. మెలుమలై సమీపంలోకి ట్రక్కు రాగానే దుండగులు కారుతో ట్రక్కును వెంబడించారు. తరువాత దానిని ఆపివేసి, డ్రైవర్, క్లీనర్లను కిందకు దించి తాళ్లతో కట్టేశారు. అనంతరం ఆ ట్రక్కుతో పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దుండగులను పట్టుకునేందుకు 17 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.