ఈరోజుల్లో ఫోన్ లేని చెయ్యి ఉండదు. నెలల పిల్లల నుంచీ ముసలి వాళ్ళ వరకూ అందరూ ఫోన్ లు తెగవాడేస్తున్నారు. మాట్లాడ్డం, అవసరం కోసం వాడితే పర్వాలేదు కానీ అంతకు మించి వాడుతున్నారు. అదే ఇప్పడు పెద్ద సమస్యగా తయారయ్యింది. టెక్సాలజీ పెరగడం, స్మార్ట్ ఫోన్లు చవకగా అందరికీ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ వినియోగం మారుమూల ప్రాంతాలకు వ్యాపించడంతో ఫోన్ ల వినియోగం చాలా ఎక్కువ అయింది. అయితే ఇంతలా ఫోన్ లు వాడితే నష్టమే తప్పితే లాభమేమీ లేదని చెబుతున్నారు డాక్టర్లు, నిపుణులు. ఇప్పటికే ఫోన్ వాడకం వల్ల కళ్ళు, వెన్నునొప్పి, చేతులు తిమ్మిర్లు లాంటి సమస్యలు చాలానే వింటున్నాం. ఇప్పుడు మరో కొత్త సమస్య బయటపడింది.
అతిగా ఫోన్ వాడడం వలన చిన్న వయసులోనే వీల్ ఛైర్ కి పరిమితం అయింది ఓ అమ్మాయి. యూకే కి చెందిన 29 ఏళ్ళ ఫెనెల్లా ఫాక్స్ చాలా ఎక్కువగా ఫోన్ వాడి వెర్టిగో సమస్యను కొని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రోజుకు 14 గంటల పాటూ ఉండేదిట ఫెనెల్లా. దీంతో ఆమె వెర్టిగో బారిన పడింది. అది కూడా చాలా ఎక్కువగా వచ్చి ఇప్పుడు మంచానికి, వీల్ ఛైర్ కి పరిమితం అయిపోయింది.
ఫెనెల్లాకు సమస్య మొదట్లో చిన్నగానే ఉండేది. తలనొప్పి, మైకం లాంటివి అప్పుడప్పుడూ వచ్చేవి. తర్వాత అదే పెద్దగా అయింది. చివరకు నడవడం కూడా కష్టం అయింది. సడెన్ గా అలా అయ్యేసరికి తన పరిస్థితి దారుణంగా మారిందని అంటోంది. ఈ సమస్యతో ఆరు నెలల పాటూ తాను తల్లిదండ్రుల మీద ఆధారపడవలసి వచ్చిందని చెబుతోంది. అయితే ఇదంతా ఫోన్ వాడడం వలన అని తనకు తెలియదని, తెలిసే సరికే దారుణం జరిగిపోయిందని అంటోంది. ఫోన్ వాడడం ఓకే కానీ నాలా అతిగా వాడొద్దని చెబుతోంది ఫెనెల్లా.