mobile tower stolen in maharastra
mictv telugu

సెల్ టవర్‌‌నే ఎత్తుకెళ్లిన దొంగలు

November 12, 2022

దొంగతనం చేయాలంటే డబ్బులు, నగలు, ద్విచక్ర వాహనాలు ఇలా విలువైన వస్తువులను పట్టుకుపోతారు. కానీ మహారాష్ట్రలో విచిత్రమైన దొంగతనం జరిగింది. ఓ సెల్ టవర్‌ను లేపేసారు దొంగలు. మీరు చదివింది నిజమే..సెల్‌ఫోన్ కాదు సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లిపోయారు. అంత ఎత్తులో ఉండే సెల్ టవర్‌ను పార్టుపార్టులుగా విడదీసి దోచేశారు. మహారాష్ట్రలోని వాలూజ్‌లో జరిగిన ఈ దొంగతనం తీవ్ర చర్చనీయాంశమైంది.

వాలూజ్‌లో జీటీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2009లో పదేళ్లపాటు భూమిని లీజ్‌కు తీసుకోని సెల్ టవర్‌ను నిర్మించింది. పదేళ్ల గడువు పూర్తికాకముందే 2018లో సదరు భూమి యజమాని జీటీఎల్ కంపెనీని ఖాళీ చేయించాడు. ఆ తర్వాత టవర్ కోసం జీటీఎల్ సంస్థ పట్టించుకోలేదు. సంస్థ ఉద్యోగులు కూడా అటువైపు తొంగిచూడలేదు. తాజాగా సెల్‌టవర్‌ను పరిశీలించేందుకు కంపెనీ యజమానులు అక్కడికి వెళ్లారు. సెల్ టవర్ లేకపోవడం చూసి ఖంగుతిన్నారు. టవర్ ఉందనే ఆనవాళ్లు లేకుండా మొత్తం దోచేశారు దొంగలు. ఈ చోరీలో సదరు టవర్ కంపెనీకి దాదాపు రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. దీనిపై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో జీటీఎల్ సంస్థ కోర్టుకెక్కింది.