Mobri cable bridge accident Safety of Telangana cable suspension bridges
mictv telugu

తెలంగాణలోని ఈ కేబుల్ బ్రిడ్జీలు సురక్షితమేనా?

October 31, 2022

గుజరాత్‌లోని మార్బిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి భారీ ప్రాణనష్టంతోపాటు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. 140 ఏళ్ల కిందటి మార్బి బ్రిడ్జిని ఇప్పటికీ ఉపయోగిస్తున్న సంగతి విషాదం జరిగిన తర్వాతకానీ బయటి రాలేదు. దాదాపు 140 మందిని బలితీసుకున్న ఈ ఘోరం దేశంలోని మిగతా కేబుల్ బ్రడ్జీల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన చాలా రోడ్డు, రైలు వంతెలను మనం నేటికీ వాడుతున్నాం. కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా కాలానికి తట్టుకుని నిలిచాయి. నిన్నామొన్నా కట్టిని బ్రిడ్జిలు పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. తెలంగాణలోనూ కొన్ని కేబుల్ బిడ్రిలు ఉన్నాయి. విజయవాడలో మరో కేబుల్ బ్రిడ్జి, కృష్ణానదిలో ఏపీ, తెలంగాణలను కలుపుతూ మరో కేబుల్ బ్రిడ్జి రానున్నాయి. తక్కువ వ్యయం, ఎక్కువ భద్రత, తర్వగా నిర్మాణం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వీటిని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధానమైన కేబుల్ బ్రిడ్జిలపై భద్రతపై ఓ విహంగ వీక్షణం.

 

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రెండేళ్ల కిందట ప్రారంభించారు. దీంతో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గింది. 145 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన పొడవు 233 మీటర్లు. ఇది ఆరు లైన్ల బ్రిడ్జి. నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్ అండ్ టీ కంపెనీ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించింది. మొదట మూడు నుంచి ఐదు పిల్లర్లతో నిర్మించాలనుకున్నా తర్వాత రెండే పిల్లర్లతో డిజైన్ చేశారు. ఇది పర్యాటక కేంద్రంగానూ మారడంతో జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు. భారీ వాహనాలు సైతం తిరుగుతుంటాయి. దీనిపై ఇప్పటికే కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే ఆధునిక టెక్నాలజీ వాడడం, నిత్య పర్యవేక్షణ, ఇటీవలే నిర్మాణమై వుండడంతో దీని వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పూలేదు.

 

కరీంనగర్ కేబిల్ బ్రిడ్జి
దీన్ని కూడా ట్రాఫిక్ రద్దీని తప్పించుకోడానికే నిర్మించారు. లోయర్ మానేర్ డ్యామ్ దిగువన మానేరు నదిపై 683 మీటర్ల పొడువుతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ బ్రిడ్జి ఔట్‌స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-2021 అవార్డును కైవసం చేసుకుంది. అధికారులు దీన్ని స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది 950 టన్నుల బరువును ఉంచి పరీక్షంచగా ఏ సమస్యా తలెత్త లేదు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న వంతెల అప్రోచ్ రోడ్ల భూసేకరణ పూర్తికాగానే ప్రారంభం కానుంది.

 

సిద్దిపేట కేబుల్ బ్రిడ్జి
ఇది పర్యాటకుల వంతెన. కోమటచెరువుపై నిర్మించిన ఈ వంతెన పొడవు 241 మీటర్లు. 2019లో ప్రారంభమైంది. పర్యాటక అధికారులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఒక దఫా 200 మంది దీనిపై విహరించవచ్చు. ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ బ్రిడ్జి సురక్షితమే.

 

లక్నవరం కేబుల్ బ్రిడ్జి
ములుగు జిల్లాలోని లక్నవరం చెరువుపై దీన్ని నిర్మించారు. 120 మీటర్ల పొడవున్న ఈ వంతెన ఇటీవల నిర్మించినదే. దీని నిర్మాణ సామగ్రిని దక్షిణ కొరియా నుంచి తెప్పించారు. పర్యాటకుల సంఖ్యపై నియంత్రణ ఉంటుంది కనుక దీనికి ముప్పులేదు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది.