మద్యం, గంజాయి సేవించడం..ఆ మత్తులో దారుణాలకు పాల్పడ్డం..అడిగితే ఎంతకైనా తెగించడం..ఈ మధ్య కొందరు ఆకతాయిలకు అలవాటుగా మారిపోయింది. పోలీసులు, కేసులు వంటి వాటికి వారు జంకడం లేదు. రోడ్డుపై పోయే అమాయకులను, సామాన్యులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. తాజాగా విశాఖలో ఆకతాయిలు రెచ్చిపోయారు. మత్తులో ఓ కుటుంబపై వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎదురుతిరిగిన వారిపై దాడి చేశారు. కనీసం మహిళ అని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
పూర్ణామార్కెట్ దరి రంగిరీజు వీధికి చెందిన భార్యభర్తలు, తమ 6 ఏళ్ల కుమార్తెతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్ పూర్తవ్వగానే తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు మద్యం, గంజాయి మత్తులో బైక్‌పై వెళ్తూ గట్టిగా హారన్ మోగించారు. వారి చేష్టలతో కుమార్తె భయపడి పెద్దగా కేకలు వేసింది. భార్యభర్తలు ఆ యువకులపై కసురుకున్నారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. భారభర్తలపై యువకులు దాడి చేశారు. భార్య వస్త్రాలను సైతం చించివేశారు. అంతేకాకండా గొడవపై సమాచారం అందుకొని మధ్యలో వచ్చిన ఆమె తమ్ముడిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయబడిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. . పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.