పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే జరిగే అనర్ధమేమిటో మనకు తెలుసు. కానీ బ్రెజిల్ కు కి చెందిన ఓ మోడల్‌కు ఇది తెలుసుకోవడానికి పన్నెండేళ్లు పట్టింది. అదీ కూడా అక్షరాల రూ. 5 కోట్లకు పైనే. జెన్నిఫర్ పాంప్లోనా(29) అనే మోడల్ కు.. అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియాన్ అంటే క్రేజ్. ఆమె లాగా కనిపించడానికి తన ముఖానికి దాదాపు రూ. 4.7 కోట్లు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకుంది. ఒకటి, రెండు కాదు.. గత 12 ఏండ్లలో 40 కాస్మెటిక్ సర్జరీలు చేసి కర్దాషియాన్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత జనాలంతా తనను కర్ధాషియాన్ గా గుర్తుపడుతున్నారు కానీ.. తనను తానుగా గుర్తించట్లేదని తెగ ఫీలయింది. గొప్ప చదువులు చదువుకొని, వ్యాపారవేత్త కూడా అయి, వ్యక్తిగత జీవితంలో ఎన్నో విజయాలను సాధించిన తనను.. తనలా కాకుండా కర్దాషియాన్‌గా ట్రీట్ చేస్తున్నారని రియలైజ్ అయి.. మళ్లీ తన రూపాన్ని తాను వెనక్కి తెచ్చుకోవాలనుకుంది.
ఇక ఆలస్యం చేయకుండా కర్దాషియాన్ లాగా కనిపించడానికి గతంలో చేసిన 40 విధానాలను రివర్స్ చేయడానికి ‘డిట్రాన్సిషన్’ అనే సర్జరీ చేయించుకుంది. సర్జరీలను వ్యసనంలా మార్చుకొని, జీవితంలో చాలా కోల్పోయానని బాధపడుతూ తన రూపాన్ని తిరిగి పొందేందుకు ‘డిట్రాన్సిషన్’ సర్జరీ చేయించుకుంది. దీనికి మరో రూ.95 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపింది. సర్జరీ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ మోడల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మనం మనలా ఉండటమే నిజమైన జీవితమని, జీవితం యొక్క అర్థాన్ని ఇప్పుడు నిజంగా అర్థం చేసుకున్నానని ఆమె చెప్పింది. కాస్మెటిక్ సర్జరీకి బానిస కావడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి మోడల్ అడిక్షన్ అనే డాక్యుమెంటరీని తీస్తానని చెబుతోంది ఈ అమ్మడు.