Moderate to heavy rains in Telangana state for another five days from today
mictv telugu

మరో 5 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

July 5, 2022

Moderate to heavy rains in Telangana state for another five days from today

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు పలు చోట్ల ఎడతెరపి లేకుండా వానలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీవర్షాలు కురిశాయి. తాజాగా, వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నేటి నుంచి మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.

ఉత్తర ఒరిస్సా దానిని అనుకుని ఉన్న దక్షిణ ఝార్ఖండ్ , గాంగ్‌టక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ రోజు ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడి…సగటు సముద్ర మట్టo నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశకు వంపు తిరిగి ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో ఈరోజు మధ్యాహ్నం నుంచి పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లకిడికపూల్, బేగంపేట్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.