రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు..మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు..మోదీ

February 5, 2020

modi....

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్‌సభలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మందిర నిర్మాణం, అభివృద్ధి సంబంధిత అంశాలపై ఈ ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అని ప్రధాని మోదీ తెలిపారు. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. భారత్ లో హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బుద్ధులు, పార్శీ, జైన్.. ఇలా అందరూ ఒకే కుటుంబమని చెబుతూ… పౌరసత్వ సవరణ చట్టంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.