ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న మోదీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న మోదీ!

March 10, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పష్టం చేశారు. సామాజిక అభివృద్ధి అనే భావనకు అర్థం.. దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడటం, వాటిని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమేనని, రాష్ర్టాలు అభివృద్ధో పోటీ పడాలని అన్నారు. ‘సమాజ అభివృద్ధి అంటే ఏదో ఒక్క ప్రాంతాన్ని పట్టుకుని వెళ్లడం కాదు.. ఒక ప్రాంతం ప్రజల్లో సెంటిమెంట్ ఉందనో లేకపోతే ఇతరేతర రాజకీయ కారణాలతో  ఓ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూసేది ప్రసక్తే లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగించారు.

పోటీపడాలి..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ సర్కారు కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. పోటీతత్వం వల్ల దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు తమ లోపాలను దిద్దుకోవాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొత్త విషయాలను నేర్చుకోవాలని మోదీ చెప్పారు. అన్ని గ్రామాలకు విద్యుత్‌ ఇవ్వగలిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.