చిత్రమైన వ్యాఖ్యానాలు, ఆవిష్కరణలకు పెట్టింది పేరు త్రిపుర సీఎం, బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేవ్. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని, బాతులతో చేపల సంఖ్య, ఆక్సిజన్ పెరుగుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడం తెలిసిందే. తాజా ఆయన మళ్లీ ఓ పెద్ద బాంబు వేశాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుల్లో ఒకరు ఆటోరిక్షా డ్రైవర్ అని, పేదరికం ప్రగతికి అడ్డుకాదని చెప్పకొచ్చారు. మోదీకి అటోడ్రైవర్ తమ్ముడు లేకపోయినా ఉన్నట్లు బిప్లవ్ చేసిన వ్యాఖ్యలపై సటైర్లు పేలుతున్నాయి.
బిప్లవ్ శనివారం అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని ప్రశసింస్తూ మాట్లాడారు. ‘మోదీ ఎంతో నిరాడంబరుడు. ఆయన కుటుంబం అతి సాధారణ కుటుంబం. ఒక సోదరుడు కిరాణా కొట్టు నడుపుతున్నాడు. మరో సోదరుడు ఆటోరిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తల్లి చిన్న ఇంట్లో ఉంటుంది. మోదీ 13ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు, నాలుగేళ్లుగా పీఎంగా ఉన్నారు. అయనా ఆయన కుటుంబం సాధారణ కుటుంబం. ప్రపచంలో ఇలా ఉంటున్న ప్రధాని ఎవరైనా ఉన్నారేమో మీరే చెప్పండి’ అని సభికులను ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాడు. మోదీకి కూడా తెలియని అతని ఆటో బ్రదర్‌ను బిప్లవ్ వెతికి పట్టుకున్నారని, ఆయనకు మోదీ ఏ కానుకు ఇస్తారో చూడాలని అంటున్నారు.
ఆ డ్రైవర్‌కు మోదీకి సంబంధమేంటి?
నిజానికి మోదీకి ఆటో నడిపే సోదరుడు లేడు. రెండేళ్ల కింద మోదీ పోలికలతో ఉన్న ఒక ఆటోడ్రైవర్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో అతడు మోదీ తమ్ముడని, కష్టపడి బతుకుతున్నాడని ప్రచారం చేశారు. అయితే అతనికి మోదీతో ఎలాంటి సంబంధమూ లేదు. అతడు ఆదిలాబాద్‌లోని బొక్కలగూడకు చెందిన షేక్ అయూబ్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయూబ్ కూడా కాదని ఓ డ్రైవర్ ఫొటోను మోడీలా మార్చారని కథనాలూ వచ్చాయి. ఈ సంగతి తెలియకో, మరి మరచిపోయే బిప్లవ్ దేవ్ మోదీకి ఓ ఆటోడ్రైవర్ సోదరుణ్ని కనిపెట్టాడు.