దేశంలో అంతరించిపోయిన చీతాలను భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తెప్పించిన విషయం తెలిసిందే. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచారు. అయితే ఈ ప్రాంత స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కరేరా నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించే ప్రగిలాల్ జాతవ్ సోమవారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని అన్నారు. అవి ఇప్పుడు చిన్నగానే ఉన్నా పెరిగి పెద్దయ్యాక కాంగ్రెస్‌కి ఓటేసే వారిని తినేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య తగ్గుతుందని, పథకం ప్రకారమే బీజేపీ రూ. 117 కోట్లు ఖర్చు చేసి చీతాలను తెచ్చిందని తనదైన కోణాన్ని ఆవిష్కరించారు. పేదలు, అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ పనిచేస్తే.. జంతువుల ప్రయోజనాల కోసం బీజేపీ పని చేస్తోందని ఎద్దేవా చేశారు. కాగా, జాతవ్ ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. దీన్ని చూసి సదరు ఎమ్మెల్యే ముఖం సంతోషంతో వెలిగిపోవడం గమనార్హం.