మోదీపై చంద్రబాబు సంచలన ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

 మోదీపై చంద్రబాబు సంచలన ఆరోపణలు

March 15, 2018

ప్రధాని మోదీపై మొన్నటివరకు ప్రశంసలు జల్లులు కురిపించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్‌లను తమపైకి ఉసిగొల్పుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే సర్వాత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్రు. ఆయన గురువారం పొద్దున టీడీపీ ఎంపీలు, సమన్వయ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  ‘మోదీ తమిళనాడులో అక్కడి సీఎం యడపాటి పళనిస్వామిపై పన్నీర్ సెల్వం ముఠాను ఉసిగొల్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే వ్యూహం అనుసరిస్తున్నారు. మాకు వ్యతిరేకంగా జగన్ మోహన్‌రెడ్డిని, పవన్ కల్యాణ్‌లను ప్రయోగిస్తున్నారు.. ఏపీని రాజకీయంగా బలహీనపరిచేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోంది..మా బలమైన నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. అయితే, ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీని, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు. టీడీపీ ఇలాంటి ఎన్నోకుట్రలను దాటుకుని వచ్చింది’ అని బాబు చెప్పారు.  తమపై విమర్శలకు ఇది సమయం కాదని, ఇప్పుడు ఎన్నికలు లేవని అన్నారు. ఏపీ అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా జగన్, పవన్ ను వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు.

దేశమంతా మోదీపై వ్యతిరేకత..

ప్రస్తుతం దేశమంతా బీజేపీపై, మోదీపై వ్యతిరేకత బలంగా ఉందని చంద్రబాబు అన్నారు. 2019లో ఏం జరగబోతోందో యూపీ, బిహార్‌లలో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.