మోదీ సర్కారుపై రేపే వైకాపా అవిశ్వాసం.. బాబు మద్దతు! - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ సర్కారుపై రేపే వైకాపా అవిశ్వాసం.. బాబు మద్దతు!

March 15, 2018

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మిత్రులెవరో, శత్రులెవరో అర్థంకాని పరిస్థితి. వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారా? లేకపోతే నిజాయతీతోనే వ్యవహరిస్తున్నారా అన్నది తెలియక జనం ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యేక హోదాపై తలో దారి అన్నట్టు వ్యవహరించిన పార్టీలు అన్నీ మరచిపోయి ఏకతాటిపైకొచ్చేస్తున్నాయి. ఉద్యమ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర సర్కారు తన హామీ నిలబెట్టుకోవడంలో విఫలమైందంటూ శుక్రవారం అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైకాపా నిర్ణయించింది. ఈమేరకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు.

ఆందోళనల నేపథ్యంలో సమావేశాలను కుదించే అవకాశం ఉండడంతో 21న ప్రవేశపెట్టాలకున్న తీర్మానాన్ని రేపే ప్రవేశపెట్టనున్నారు. దీనికి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే  టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను కోరారు. మరోపక్క.. వైకాపా తీర్మానానికి మద్దతివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమని ఆయన గురువారం పార్టీ నేతల సమావేశంలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.