కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తుండడం, మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు రానుండడం నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగస్టులో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. 10లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో నోటిఫికేషన్లు ఇస్తాం.
ఇప్పటికే లక్షా యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. రెండు విడతల్లో చాలా నియామకాలు చేపట్టాం. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20న అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తాం’’ అని చెప్పారు. సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం మోదీ వీడియో కాన్షరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని చెబుతూ కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 100 వందే భారత్ రైళ్లు నడుపుతామని, తమ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు.