Modi Govt No Reaction on Mlas Poaching case
mictv telugu

అసలు సినిమా ముందుందా?

November 4, 2022

Modi Govt No Reaction on Mlas Poaching case

టీజర్ విడులైంది.రాష్ట్రంలో ప్రకంపం..దేశంలో నో రెస్పాన్స్. సంచలనమంటూ సగం సినిమా వచ్చేసింది. అయినా అక్కడ మౌనమే. కోర్టులు, దర్యాప్తు సంస్థలు, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫుటేజ్ పంపిస్తున్నాం.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని కేంద్రప్రభుత్వం పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు..ఇక్కడ సైలెంటే. తెలంగాణనే కాదు ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్ని కూల్బబోతున్నారని..దానికి నిదర్శమే 70 నిమిషాల వీడియో అంటూ కేసీఆర్ రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షానే కాదు బీఎల్ సంతోష్ , తుషార్ లూ స్పందించడం లేదు ఎందుకు?అసలు సినిమా కేసీఆర్ ముందు ముందు చూపించబోతున్నారా?అంతా అయ్యాకే రియాక్ట్ అవుదామని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా?

అమిత్ షా వీడియో ఏమైంది?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు..ఎన్నో ట్విస్టులు..మరెన్నో అనుమానాలు..పచ్చినిజాలు అని సీఎం కేసీఆర్ బరువెక్కిన గుండెతో చెబుతుంటే..అన్నీ కట్టుకథలు అని తెలంగాణ కమలం నేతల కొట్టిపారేస్తున్నారు. మునుగోడు బై పోల్‌కు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారని రామచంద్రభారతి,నందు, సింహయాజి ఆడియోలు రిలీజ్ అయ్యాయి. ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత వీడియోల్ని ఏకంగా సీఎం కేసీఆర్ రిలీజ్ చేశారు. ఆధారాల్ని మీడియాకు అందించారు. మొత్తం 3గంటల వీడియోని కుదించి 70 నిమిషాల నిడివి గల నాలుగుపార్ట్ ల్ని వదిలారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం హత్య చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణతో పాటు నాలుగుప్రభుత్వాల్ని కూల్చబోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 2015 నుంచి వీళ్ల కాల్ రికార్డులు తమ దగ్గర ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. సీరియస్‌గా మాట్లాడుతూనే కొన్ని అప్రస్తుత టాపిక్స్ ను తెరపైకి తెచ్చారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇందిరాగాంధీ పరిస్థితి, జేపీ ఉద్యమం, ఎన్టీఆర్ ప్రస్తావన ఇలా చాలా చెప్పుకుంటూపోయారు. టీఆర్ఎస్ నేతలు అంటున్నట్టు అమిత్ షా వీడియో కోసం అందరూ ఎదురుచూశారు. బిగ్ బాస్ వీడియో రిలీజ్ చేసి కేంద్రాన్ని షేక్ చేస్తారని ఊహించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడే కాదు అసలు ముందు ముందు ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

మోదీ షా మౌనం వెనుక..

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం ఆడియోలు, వీడియోలు వచ్చేశాయి. వీడియోలో అసలు ఏం ఉందో స్వయంగా మీరే చూడాలని సీఎం కేసీఆర్ అందరినీ కోరారు. సుప్రీం కోర్టు జడ్జీలు, సీబీఐ,ఈడీ ,అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధ్యక్షులకు వీడియో పంపించారు. గంటకు పైగా జరిగిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ బోలెడు ఆరోపణలు చేసినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక్కరూ స్పందించలేదు. దేశం ఆగమైపోతుందని నెత్తినోరు బాదుకుంటున్నా ఢిల్లీ పెద్దల్లో చలనం లేదు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలయదన్నట్టు ఉన్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడం లేదా?కావాలనే మోదీ, అమిత్ షా మౌనంగా ఉంటున్నారా? ఆఖరకు కీ రోల్ అని చెబుతున్న తుషార్ , బీఎల్ సంతోష్ లు ఎందుకు స్పందించడం లేదు. ఏ విషయంలోనైనా కేంద్రం పై బీజేపీ నేతలు ఈగ వాలనీయ్యరు. ఏ చిన్న ఇష్యూ అయినా వాయిస్ వినిపిస్తుంటారు. ఈ వీడియోల విషయంలో ఏమైంది? ఇఫ్పుడు అందరి వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే.

బీజేపీ లోకల్ లీడర్లే తప్ప….

వచ్చిన ముగ్గురు రామచంద్రభారతి, సింహయాజి, నందు…బీజేపీ లోకల్ లీడర్లను లైట్ తీసుకున్నారు. వీడియో సంభాషణల్లో వారిని ..అలా తీసిపారేశారు. ఇప్పుడు కేసీఆర్‌కు కౌంటర్ ఇస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాటల్ని జనం పెద్దగా పట్టించుకోవడంలేదు. వీళ్లు కాదు కేంద్రం పెద్దలు కదా మాట్లాడాల్సింది అని అనుకుంటున్నారు. తెలంగాణ కమలం నేతలు ఎవరూ వీడియోలపై పెద్దగా స్టడీ చేసి మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు. కామన్ మ్యాన్ వెతుకుతున్న లాజిక్కులు కూడా వీరు ఎత్తులేకపోతున్నారని టాక్. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నందునే కేంద్రం రియాక్ట్ కావడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు.

వీడియోల లీక్‌పై కోర్టు ఆరా

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో బయటకొచ్చిన వీడియోలపై హైకోర్టు ఆరా తీసింది. చార్జ్ షీట్ దాఖలు కంటే ముందే ఈ వీడియోలు బయటకు రావొద్దు కదా అని న్యాయవాదల్ని ప్రశ్నించింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.