అవిశ్వాసాలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? - MicTv.in - Telugu News
mictv telugu

అవిశ్వాసాలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

March 16, 2018

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైకాపాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై తీసుకురాబోతున్న అవిశ్వాసాల ప్రభావం చూపుతాయా? కాషాయ సర్కారు ప్రమాదంలో పడుతుందా? ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగితే నష్టం ఎవరికి? ఎన్నికలకు గట్టిగా ఏడాది కూడా వ్యవధిలేని నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాలు తీసుకోవడంలో నిజాయతీ ఎంత? ఇదంతా ప్రజలను ఆకర్షించి ఓట్లు దండుకోవాలనే వ్యూహమా? ఇలాంటి మరెన్నో అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాలు మోదీ సర్కారును ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో వాటి వల్ల ఒరిగేదేమిటి? ఈ తీర్మానాలతో నష్టపోయేది ఎవరు?బలబలాలు ఇవీ..

అవిశ్వాసాలను బీజేపీ సులభంగా అధిగమిస్తుంది. లోక్‌సభలో ఆ పార్టీకి సొంతంగా 275 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాలైన ఎస్ఎస్ నుంచి 18 మంది, ఎల్జేపీ నుంచి ఆరుగురు, ఎస్ఏడీ నుంచి నలుగురు, ఇతరులు 11 మంది మోదీకి అండగా ఉన్నారు. మొత్తం 315 మంది దాకా(టీడీపీ లేకుండా) ఎన్డీఏకు బాసటగా ఉన్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ కనుక జరిగితే మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా చేతులు కలిపే అవకాశముంటుంది.

అవిశ్వాసానికి మద్దతిచ్చేదెవరు?

అవిశ్వాస తీర్మానాన్నిసభ చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. టీడీపీ తీర్మానానికి మద్దతిస్తామని 37 మంది సభ్యులున్న అన్నాడీఎంకేతోపాటు 48 మంది సభ్యులున్న కాంగ్రెస్, 34 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్, 18 మంది సభ్యులున్న శివసేన మద్దతివ్వనున్నట్లు సమాచారం. టీడీపీకి 16 మంది సభ్యులున్నారు. చిన్నాచితకా పార్టీలు, వామపక్షాలు కూడా కలిస్తే తీర్మానానికి దాదాపు 150 మంది మద్దతు లభిస్తుంది. వైకాపా తీర్మానానికి మద్దతిచ్చే పార్టీలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అవిశ్వాస తీర్మానం విషయంలో వైకాపా సీరియస్‌గా లేదని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే చెబుతున్నారు. అవిశ్వాసం చీప్ పాటిలిక్స్ అని అన్న టీఆర్ఎస్ ఈ వ్యహారానికి దూరంగా ఉంటుంది.

జాతీయ స్థాయిలో రచ్చరచ్చ..

టీడీపీ, వైకాపాల తీర్మానాలు వీగిపోయినా, హోదా అంశం జాతీయ స్థాయిలోకి వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే పార్లమెంటులో ఈ అంశంపై నిరసనలు తెలుపుతున్నప్పటికీ.. సమస్య తీవ్రతను దేశానికి తెలపడానికి ఉపకరిస్తాయి. విభజన వల్ల ఏపీ నష్టపోయిన తీరు, మోదీ వాగ్దన భంగం, దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు వంటి ఆంశాలు దేశం దృష్టికి వస్తాయి. పార్లమెంటు అత్యున్నత అధికార స్థానం కనుక అక్కడ తనపై వచ్చే ఆరోపణలు మోదీ ప్రతిష్టను మరింతగా దెబ్బతీస్తాయి.

ఈ పార్టీలకు లాభం..

అవిశ్వాస తీర్మానాలతో టీడీపీ, వైకాపాలు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నాయన్ననమ్మకం ఏపీ ప్రజలకు కలుగుతుంది. నాలుగేళ్లు ఆలస్యంగానైనా కళ్లు తెరిచారని జనం భావిస్తారు. వైకాపా ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుంది. ఈ విషయంలో టీడీపీని శంకించే అవకాశం కూడా ఉంటుంది. నాలుగేళ్లు మౌనంగా ఉండి, వైకాపా అవిశ్వాసం తెస్తామన్న తర్వాతే టీడీపీ ఆ మంత్రాన్ని జపించడం అనుమానాలకు తావిస్తుంది. అయితే చంద్రబాబు వ్యూహాలు, కొత్త రాజధాని నిర్మాణం, ఇతర ఆటుపోట్లు టీడీపీపై సానుభూతి కలిగించే అవకాశం ఉంది. హోదా అంశంపై గళం విప్పుతున్న పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా కొంత లబ్ధి కలగొచ్చు. ఏదేమైనా అన్యాయానికి గురైన ఒక రాష్ట్ర వేదన జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ తీర్మానాలు దోహదపడతాయి.

ఏపీకి ఏమైనా దక్కుతుందా?

మోదీ ఈ తీర్మానాలను సీరియస్‌గా తీసుకుంటే తనవైపు నుంచి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినా ఆ దిశగా ఏదో ఒక కమిటీనో వేయొచ్చు. లేకపోతే మరో ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించే అవకాశం ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైకాపాను తనవైపు తిప్పుకోవడానికి, లేకపోతే మళ్లీ టీడీపీని అక్కున చేర్చుకోవడానికి ఏపీకి ఎంతో కొంత సాయం చేయొచ్చు. అవిశ్వాసాలు తెచ్చారని ఆగ్రహిస్తే కనుక ఏపీకి అసలేమీ దక్కకపోవచ్చు కూడా.