మోదీకి గ్లిజరిన్ లేకుండానే కన్నీరు కారిపోతుంది..   - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి గ్లిజరిన్ లేకుండానే కన్నీరు కారిపోతుంది..  

November 30, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ ప్రచారంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మాటకు మాట అంటిస్తున్నారు. ‘నేను టీ అమ్ముకున్నా.. దేశాన్ని అమ్ముకోలేదు’ అని మోదీ అనడం తెలిసిందే. దీనిపై రాహుల్ భగ్గుమన్నాడు.. పనిచేసేవాడు మాటలు చెప్పుకోడని అంటించాడు. మోదీ అమితాబ్ బచ్చన్ కంటే గొప్పనటుడని, ఆయన గ్లిజరిన్ అక్కర్లేకుండా కన్నీళ్లు జలజలా పారించి, ప్రజల కళ్లలోనూ నీళ్లు రప్పిస్తారని ఎద్దేవా చేశాడు.‘మోదీ మహానటుడు.. ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేశంలో అత్యుత్తమ నటుడు అని అందరికీ తెలుసు.  అయితే ఆయన కంటే ప్రధాని నరేంద్ర మోడీ మహానటుడు. అయితే మోదీకి, నటుడికి ఒక తేడా ఉంది. సినిమాల్లో నటించే వారి కళ్లలో నీళ్లు రావాలంటే గ్లిజరిన్, లేదా లెన్స్ ఉపయోగిస్తారు. అయితే ఆ రెండు ఉపయోగించకుండానే మోదీ ప్రజల ముందు నిలబడి కళ్లలో నీళ్లు రప్పిస్తారు..’ అని అన్నాడు.

ప్రజలను బీజేపీ తన దుష్టవిధానాలతో హింసిస్తోందని మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకిస్తే లాఠీ ఝళిపిస్తున్నారని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ప్రచారంలో అన్నారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్‌లో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి.