80 కోట్ల మందికి నవంబర్ వరకు ఉచిత రేషన్.. మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

80 కోట్ల మందికి నవంబర్ వరకు ఉచిత రేషన్.. మోదీ

June 30, 2020

PM Garib Kalyan Ann.

కరోనా సంక్షోభంలో పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్‌ను నవంబర్ వరకు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జాతినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే నవంబరు చివరి వరకు   పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. ఇందుకోసం రూ.90 కోట్లు అదనంగా కేటాయిస్తున్నాం. ఈ పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు, కుటుంబానికి నెలకు కిలో చొప్పున కందిపప్పు అందిస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని.. ఐతే అన్‌లాక్ 1 తర్వాత నిర్లక్ష్యం పెరిగిందని ప్రధాని మోదీ వాపోయారు.  

వర్షాకాలం కారణంగా రాబోయే రోజుల్లో జలుబు, జ్వరం వంటి వ్యాధులు ప్రబలుతాయని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్ 2 లోకి ప్రవేశించాం. ఎప్పటికప్పుపడు అప్రమత్తతతో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనాను అదుపు చేయగలిగాం. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే కంటైన్‌మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరైతే కరోనా నిబంధనలను పాటించరో వారిని అడ్డుకుని జరిమానాలు విధించాలి. మాస్క్ ధరించనందుకు దేశ ప్రధానికే రూ.13 వేలు జరిమానా విధించారు. మన దేశంలో కూడా అలాంటి నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’ అని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు పేదల కోసం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన తీసుకొచ్చామని అన్నారు. వారి కోసం రూ.2వేల కోట్లు కేటాయిచామని తెలిపారు. ఈ కష్ట కాలంలో ఏ ఒక్కరు ఆకలితో నిద్రపోకుండా చర్యలు తీసుకోగలిగామని.. గరీబ్ కల్యాణ్ యోజన కోసం 1.75 లక్షల కోట్లు కేటాయించామని ప్రకటించారు. 20 కోట్ల మంది పేదల ఖాతాల్లో 31వేల కోట్ల నగదును డిపాజిట్ చేశామని.. రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్ల నగదు జమ అయిందని ప్రధాని మోదీ వివరించారు.