ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం మార్కాపురం గ్రామంలో నివాసముంటున్న రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం మన్‌కీ బాత్‌లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ..”సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలేనంత మంది ఈ మంత్రాన్ని వారి జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో నివాసముంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. అతడు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతోపాటు, వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు. రాంభూ పాల్‌రెడ్డి చేస్తున్నా సేవలకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయంలో అతన్ని మనసారా అభినందిస్తున్నా” అని ప్రధాని మోదీ అన్నారు.
రాంభూపాల్‌రెడ్డి.. 35 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు.