తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది.. మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది.. మోదీ

May 26, 2022

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో రాజకీయ వేడి పుట్టించారు. మూఢనమ్మకాల నేతల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు సంధించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినస్ వార్షికోత్సవం కోసం గురువారం హైదరాబాద్ చేరుకున్న మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ప్రసంగించారు. కేసీఆర్‌ను, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలుస్తూ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘నేను సైన్స్, టెక్నాలజీలను నమ్ముతాను. మూఢనమ్మకాలను నమ్మని సాధువైన యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను అభనందిస్తాను. మూఢనమ్మకాలను నమ్మేవారి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’ అని ప్రధాని అన్నారు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. పట్టుదల, పౌరుషానికి తెలంగాణ మారు పేరని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగి, బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తున్నానన్న ఆయన వారి కలలు సాకారం కాడం లేదని అన్నారు. ‘తెలంగాణ ఒక కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడలేదు. కుటుంబ పార్టీ వల్ల ఎంతగా అవినీతి జరుగుతుందో చూశాం. యువత సహకారంతో తెలంగాణను ఉచ్ఛస్థితికి తీసుకెళ్తాం’ అని చెప్పారు.