ప్రధాని నరేంద్ర మోదీ రేపు (గురువారం) మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. అంతకు ముందే ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లనున్నారు. యాదృచ్ఛికంగా ఇరువురు నేతలు హైదరాబాద్‌లో కలవకపోవడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. ముచ్చింత్ ఆశ్రమంలోని రామానుజ విగ్రహావిష్కరణకు మోదీ వచ్చినప్పుడు జ్వరం కారణంగా కేసీఆర్ కలవలేకపోయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ బుధవారం జాతీయ రాజకీయాల్లో భాగంగా వెళ్తుండగా, మోదీ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవంలో పాల్గొనడానికి భాగ్యనగరానికి వస్తున్నారు. జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇటీవల ఢిల్లీ, చండీగఢ్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులతో సమావేశం కావడం తెలిసిందే. ఆయన బెంగళూరులో మాజీ ప్రధాని, జేడీయూ నేత దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చలు జరుపుతారు.
మోదీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుని మూడు గంటలపాటు నగరంలో ఉంటారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలుకుతారు. మోదీ పర్యటకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఐఎస్బీ క్యాంపస్‌లో రెండువేల మందిని మోహరించారు. పంజాబ్‌కు చెందిన వందలమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచాయి. గతంలో మోదీ పంజాబ్‌లో పర్యటించినప్పుడు నిరసనలు కారులు అడ్డుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టారు.