నాసిరకం వైద్యం.. ప్రధాని పరువు తీసిన పీఎంఓ - MicTv.in - Telugu News
mictv telugu

నాసిరకం వైద్యం.. ప్రధాని పరువు తీసిన పీఎంఓ

February 9, 2018

వాక్యాల్లో పదాలే కదు, కామాలు, ఫుల్ స్టాపులు కూడా ముఖ్యమే. ఏమాత్రం తేడా కొట్టినా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లా పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. పీఎంఓ ఓ కామాను మరచిపోయి ట్వీట్ చేసి మోదీ పరువు తీసింది. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు పీఎంఓపై జోకులు పేల్చేస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పార్లమెంటులో ప్రజారోగ్యానికి సంబంధించి చేసిన ప్రసంగంలోని ఓ అంశంపై పీఎంఓ ఓ ట్వీట్ చేసింది. ‘మనమంతా కలిసి నాసిరకమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కృషి చేద్దాం.. పీఎం’ అని పేర్కొంది. అయితే నిజానికి ప్రధాని ఉద్దేశం అదికాదు. ‘‘పేదలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మనమంతా కృషి చేద్దాం’ అని ఆయన చెప్పారు. అయితే ‘పూర్’ తర్వాత ‘కామా’(,) పెట్టకపోవడంతో మొత్తం అర్థం మారిపోయింది.గ్రామర్, వాక్యనిర్మాణం సరిగ్గారాని వారు పీఎంఓలో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే పీఎంఓ నిజమే చెప్పిందని, ప్రభుత్వం అందిస్తున్న వైద్యం నాసిరకంగా ఉంది కనుక ఆ  విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారని సటైర్లు విసురుతున్నారు. మోదీ తీరు.. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్లు ఉందని, అతిగా ట్వీట్లు చేస్తే ఇలాంటి శాస్తే జరుగుతుందని హితవు పలుకుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా పీఎంలో దీనిపై స్పందించడం లేదు.