3 లక్షల మందిని సంపాదించుకోండి.. మోదీ టార్గెట్ - MicTv.in - Telugu News
mictv telugu

3 లక్షల మందిని సంపాదించుకోండి.. మోదీ టార్గెట్

March 24, 2018

ట్విటర్లో క్రియాశీలంగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ ఎంపీలు కూడా తన బాట పట్టాలని హుకుం జారీ చేశాడు. ప్రతి ఎంపీ కచ్చితంగా ట్విటర్ ఖాతా తెరవాలని, 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టాడు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

టెక్నాలజీని అనుకూలంగా వాడుకుని బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చిపెట్టాలని, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని కోరారు. ‘విపక్షాలు మనకు వ్యతిరేకంగా కట్టుకథలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే మనం జాగరూకతతో ఉండాలి. అందుబాటులో ఉన్న అన్నిమార్గాల్లో జనానికి’ అని అన్నారు. ప్రజలు చేరువ కావడానికి సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ఓటర్లకు ఎలా దగ్గరకావాలో చెబుతూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ఏకరువు పెట్టారు.

బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారో లేదో కూడా మోదీ తెలుసుకున్నారు. 43 మందికి ఫేస్‌బుక్ ఖాతాలే లేవని, ఉన్నవారిలో 77 మంది అకౌంట్లకు వెరిఫికేషన్ పూర్తికాలేదని వెల్లడైంది. దీనిపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది.