modi vishaka tour
mictv telugu

మోడీ విశాఖ టూర్.. భారీ భద్రతా ఏర్పాట్లు

November 12, 2022

modi vishaka tour
ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు విశాఖ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూశణ్ హరిచంద్రన్‌తో మోడీ భేటీ అవుతారు. తర్వాత కొంతమంది వీఐపీలను మోడీ కలుస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్శిటీకి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అక్కడే భారీ బహిరంగ సభలో మాట్లాడతారు.అయితే మోడీ ఏం మాట్లాడతారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఏపీకి ఏమైనా హామీలు ఇస్తారా ? రాజధానిపై స్పందిస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రప్రజలు.

ప్రధాని మోడీ టూర్‌కు భారీ భద్రత ఏర్పాటు చేసారు. 7 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రతి 50 అడుగులకు ఒక పోలీస్ ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీతో పాటు 30 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభా ప్రాంగణం వద్ద 3,500 మంది విధుల్లో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరం పనులు ఉంటేనే విశాఖ ప్రజలను బయటకు రావాలని పోలీసులు కోరారు. నగరంలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.మోడీ సభకు భారీగా ప్రజలు తరలివస్తుండడంతో సాగర నగరం జనసంద్రంగా మారింది. ఇటు వైసీపీ, అటు బీజేపీ ఏయూలోని మోడీ సభకు భారీగా జనసమీకరణ చేశారు.

మోడీ ఏపీ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే 260 కోట్ల రూపాయలతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు కు శంకుస్థాపన చేస్తారు. 26 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన హెచ్‌పీసీఎల్‌ నవీకరణ, విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తరువాత 152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. సుమారు 560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.