టీమిండియా పేసర్, హైదరాబాదుకు చెందిన మహ్మద్ సిరాజ్ కెరీర్లో అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వన్డేల్లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం అధికారికంగా వెల్లడించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు, లంకతో 3 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మొత్తం 729 పాయింట్లతో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. బుమ్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా ఆటగాడు సిరాజ్ కావడం విశేషం. రెండో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ రెండు పాయింట్ల తేడాతో ఉన్నాడు. 3వ స్థానంలో బౌల్ట్, 4వ స్థానంలో మిచెల్ స్టార్క్, 5వ స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నారు. అటు న్యూజిలాండ్‌తో మూడో వన్డే నెగ్గిన భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక టీ20ల్లో ఇప్పటికే నెం 1 స్థానంలో ఉండడం తెలిసిందే. ఇలా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తున్న భారత జట్టు టోర్నీల్లో మాత్రం తరచూ విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.