మోకాళ్లపై కూర్చోబెట్టి అమ్మనా బూతులు తిట్టారు.. మోహన్ బాబు హెయిర్ డ్రెస్సెర్ - MicTv.in - Telugu News
mictv telugu

మోకాళ్లపై కూర్చోబెట్టి అమ్మనా బూతులు తిట్టారు.. మోహన్ బాబు హెయిర్ డ్రెస్సెర్

March 1, 2022

mohan babu

టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు కుటుంబం చిక్కుల్లో పడింది. ఇప్పటికే ఆయన కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో సాగు భూమి లేని నిరుపేదలకు కేటాయించాల్సిన దరఖాస్తు పట్టాలను మోహన్ బాబు, విష్ణు పేరిట మంజూరు చేయడం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో 11 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రెస్సర్‌గా పని చేస్తున్న నాగశ్రీను అనే వ్యక్తిపై కులం పేరుతో దూషించి, 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ మెటీరియల్ దొంగిలించాడు అంటూ అతనిపై కేసు పెట్టిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా నాగశ్రీను మాట్లాడుతూ, పలు సంచలనమైన విషయాలను బయటపెట్టాడు. “గత నెల 17వ తేదీ మధ్యాహ్నం నుంచి నేను మోహన్ బాబు వద్ద పనిచేయటం మానేశాను. ఎందుకు అంటే నన్ను అమ్మనా బూతులు తిట్టారు. కూలం పేరుతో దూషించారు. ఈ విషయం తెలిసి మా అమ్మకు హార్ట్ స్ట్రోకు వచ్చింది. మీరంతా పెద్ద వాళ్లు నన్ను కులం పేరుతో, నానా మాటలు తిట్టడం తప్పు. అంతేకాకుండా మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫోటోలు విష్ణు దగ్గర ఉన్నాయి. నేను దొంగతనం చేశానని విష్ణు నాపై కేసు పెట్టాడు” అని నాగశ్రీను ఆవేదన చెందాడు.

మరోపక్క ఈ వ్యవహారంపై నాయీ బ్రాహ్మణ సంఘం మండిపడుతోంది. తప్పు చేసుంటే పోలీస్ స్టేషన్‌లో తేల్చుకోకుండా, మోకాలిపై కూర్చోబెట్టడం, కులాన్ని దూషించడం సరైంది కాదు అంటున్నారు. ఆధారాలు చూపించాలని, తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.