దేశ రాజకీయాల్లో బాంబు పేల్చిన కేసీఆర్.. ఒక్క వీడియోతో నేషనల్ హీరో స్టేటస్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశ రాజకీయాల్లో బాంబు పేల్చిన కేసీఆర్.. ఒక్క వీడియోతో నేషనల్ హీరో స్టేటస్

November 3, 2022

మొయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మరిన్ని వివరాలు బయటపెట్టారు. అందుకు తగ్గ ఆధారాలను వీడియో రూపంలో మీడియాకు విడుదల చేశారు. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఎలా ప్రభుత్వాలను కూలగొట్టిందీ? తర్వాత ఏయే రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుందీ అనే మొత్తం కుట్రను సాక్ష్యాలతో సహా బహిరంగపరిచారు. వీడియోలో పట్టుబడ్డ నిందితుల మాటలను బట్టి చూస్తే.. తర్వాతి క్రమంలో తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్‌లు ఉన్నాయని తేలింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌‌ని తాను అప్రమత్తం చేసినట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు. మూడు గంటల పాటు ఉన్న వీడియోలో పలుమార్లు జేపీ నడ్డా, అమిత్ షాల పేర్లు వచ్చాయని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అరాచకం రాజ్యమేలుతుందని, ప్రజలు, యువత ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నారు. అలాగే ప్రధాని మోదీకి దేశాన్ని కాపాడాలని, ఇలాంటివి అడ్డుకోవాలని విన్నవించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరువు కాపాడాలని మనవి చేశారు. బయటపడ్డ వీడియోలను దేశంలోని అన్ని మీడియా సంస్థలకు, రాజకీయ పార్టీల అధ్యక్షులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, సుప్రీం, హైకోర్టు జడ్జీలకు, అన్ని రాజ్యాంగ సంస్థలకు పంపిస్తున్నట్టు వివరించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఏవిధంగా ప్రభుత్వాన్ని కూల్చారో మొత్తం ప్రక్రియను ఇంత బహిరంగంగా మాట్లాడుతున్న వీరి వెనుక ఏ శక్తి ఉందని, ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇక రేపటి నుంచి రోజూ మీడియా సమావేశం నిర్వహిస్తానని, విడుదల చేసిన వీడియోను అందరూ చూడాలని సూచించారు.