24 ఏళ్ల కుర్రోడు.. వందలకోట్ల ఆస్తులు వదిలి సన్యాసం - MicTv.in - Telugu News
mictv telugu

24 ఏళ్ల కుర్రోడు.. వందలకోట్ల ఆస్తులు వదిలి సన్యాసం

March 19, 2018

కామిగాక మోక్షగామి కాడు.. అని అంటారు. సన్యాసం తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సంసారంపై విరక్తి, ఆర్థిక కష్టాలు, ఆప్తుల మరణాలు.. మరెన్నో సర్వసంగపరిత్యాగంవైపు మళ్లిస్తాయి. అయితే పట్టుమని పాతికేళ్లు కూడా లేని మోక్షేశ్ షాకు అలాంటి కష్టాలేమీ లేవు. అసలతనికి పెళ్లే కాలేదు..! ఈ పటాటోపాల ప్రపంచంపై విరక్తి కలిగింది. వందల కోట్ల ఆస్తులను గడ్డిపోచల్లా తృణీకరించేసి వచ్చే నెల 20న అహ్మదాబాద్‌లో సన్యాసం పుచ్చుకోనున్నాడు.గుజరాత్ మూలాలున్న మోక్షేశ్ కుటుంబం  మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నివసిస్తోంది. కుటుంబానికి భారీ వ్యాపారాలు ఉన్నాయి. ఏటా రూ. 100 కోట్ల టర్నోవర్ ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మోక్షేశ్ పెద్దలు చెప్పినట్లే వ్యాపారంలో కొన్నాళ్లున్నాడు. కానీ అతనికి ధనంతో భౌతిక సుఖాలే కానీ ఆత్మతృప్తి అనేదే లేకుండా పోయింది. దీంతో సన్యాసం పుచ్చుకోవాలని గత ఏడాది తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.  కానీ కుటుంబ సభ్యులు వొప్పుకోలేదు. ముందు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను.. తర్వాత ఆ లంపటంలో పడితే సన్యాసం పేరెత్తవు అని అన్నారు. అయినా కుర్రాడు పట్టించుకోలేదు. ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించాడు.

‘డబ్బుతో సంతోషంగా బతకొచ్చు. కానీ అది తాత్కాలికం మాత్రమే. శాశ్వత ఆనందాన్ని పొందాలంటే అన్నీ వదిలేసుకోవాలి. రెండేళ్లు వ్యాపారంలో ఉన్నా నాకెలాంటి తృప్తీ కలగలేదు. అందుకే దీక్షను స్వీకరించి జైన సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాను.. మనం సంపద కోసం పాకులాడకూడు.. ఇతరులకు సాయం చేయాలి. జైన తీర్థంకరులు ఇదే బోధించారు.. ’ అని మోక్షేశ్ చెప్పాడు. తాము చిన్నప్పుడు ఏదో జాతకం చూసి మోక్షేశ్ అని పేరు పెట్టామని, అతడు నిజంగా మోక్షం బాటపడతాడని కలలో కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.