కొడితే పెద్ద టార్గెట్‌నే కొట్టాలనుకున్నారు. చిన్న షాపుల్లో, బ్యాంకుల్లో డబ్బు పెద్దగా ఉండదని ఏకంగా కోట్లకొద్దీ క్యాష్ తీసుకెళ్తున్న విమానాన్నే టార్గెట్ చేశారు. విమానం అటు ల్యాండ్ కాగానే ఇటు రన్‌వేపైకి దూసుకొచ్చాయి. కానీ టైమ్ బాలేకపోవడంతో ఒకడు చావగా మిగతాళ్లు పారిపోయారు. దుండగుల కాల్పుల్లో విమానయాన ఉద్యోగి ఒకరు చనిపోయారు. హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపించే ఈ సంఘటన దక్షిణ అమెరికా ఖండ దేశం చిలీ రాజధాని శాంటియాగోలో జరిగింది.
అమెరికాలోని మయామీ నుంచి ఓ విమానంలో 32.5 మిలియన్ డాలర్ల(రూ. 262 కోట్లకు పైనే) నగదును బుధవారం శాంటియాగోకు తీసుకొచ్చారు. ఆ డబ్బును ఎయిర్ పోర్టు నుంచి ట్రక్కుల్లో దేశంలోని వివిధ బ్యాంకులకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన దోపిడీ ముఠా పక్కా స్కెచ్ వేసింది. విమానంలోని క్యాష్‌ను సెక్యూరిటీ ట్రక్కులోకి లోడ్ చేస్తుండగా పది మంది దొంగలు వేంచేశారు. తమ వాహనాలతో ఎయిర్ పోర్టు గోడను బద్దలు కొట్టుకుని నేరుగా రన్ వేపైకి దూసుకొచ్చారు.
ఈ హఠాత్పరిణామానికి అక్కడి భద్రతా సిబ్బంది విస్తుబోయారు. ఆలోపే దొంగలు వారిపై దాడి చేసి తుపాకులు గుంజుకున్నారు. మిగతా భద్రతా సిబ్బంది తేరుకుని కాల్పులు జరపగా ఒక దొంగ హతమయ్యాడు. మిగతా దుండగలు తోకముడిచారు. దొంగల కాల్పుల్లో ఒక ఉద్యోగి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దొంగలు ఒక్క డాలరు కూడా ఎత్తుకెళ్లలేదని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.