స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్ని చేరువ అయిపోయాయి. ఫుడ్,షాపింగ్ యాప్‌లతో బయటకు వెళ్లే పనిలేకుండా పోయింది. మనుషులకు ఎంతో సౌకర్యవంతమైన ఈ యాప్‌లు చివరకు కోతులకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఓ కోతి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని యాంజెంగ్ వైల్డ్ ఎనిమల్ వరల్డ్‌లో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
మెంగ్‌మెంగ్ అనే యువతి జూ కీపర్‌గా పనిచేస్తోంది. అందులో కోతులతో పాటు పలు రకాల జంతుల పోషణ ఆమె చేసుకుంటోంది. అలా ఎప్పుడూ తనపక్కనే ఓ వానరం తిరుగుతూ ఉండేది. ఓ రోజు ఆమె కొన్ని నిత్యావసర వస్తువుల కోసం ఆన్లైన్లో వెతికింది. ఆ సమయంలో కోతి కూడా దాన్ని గమనించింది. తర్వాత ఫోన్ ఇంట్లోనే పెట్టి కోతికి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినట్టు మొబైల్ కు సమాచారం వచ్చింది. అసలేం జరిగిందని ఆమె ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. కోతి తన మొబైల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా తెలిసింది.
తనను ప్రతి రోజు ఆ కోతి గమనించడం ద్వారా ఆన్లైన్లో షాపింగ్ చేయడం నేర్చుకుందని మెంగ్‌మెంగ్ తెలిపింది. ఆ కోతికి తన ఫోన్‌తో ఆడటం చాలా ఇష్టమని అలా తనను అనుకరించేదని చెప్పింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మొత్తానికి కోతి ఇలా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఆన్లైన్ షాపింగ్‌లు చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.