ఆరేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసుకు సంబంధించి… సాక్ష్యాలు అందజేయమన్న కోర్టుకు వింత సమాధానం చెప్పారు పోలీసులు. కేసులో కీలకమైన ఆధారాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని వాంగ్మూలం ఇవ్వడంతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ కోర్టులో చోటుచేసుకుంది.
2016 సెప్టెంబర్‌లో చందవాజీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శశికాంత్ శర్మ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి రాహుల్ కందేరా, మోహన్ లాల్ కందేరా అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆయుధంతో సహ మొత్తం 15 సాక్ష్యాధారాలను సేకరించినట్టు కోర్టుకు తెలియజేశారు పోలీసులు. అయితే ఆ సాక్ష్యాలను కోర్టులో అందజేయాల్సిన రోజున సాక్ష్యాధారాలున్న బ్యాగ్‌ని కోతి తీసుకెళ్లిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా సమర్పించారు. సాక్ష్యాలను బ్యాగ్‌లో పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గరున్న చెట్టు కింద పెట్టామని, ఎక్కడినుంచో వచ్చిన ఓ కోతి ఆ బ్యాగ్‌ని తీసుకుని పారిపోయిందని చెప్పారు.