కోతికి అంత్యక్రియలు..!  వీళ్ల గొప్ప మనసుకు  సలాం..! - MicTv.in - Telugu News
mictv telugu

కోతికి అంత్యక్రియలు..!  వీళ్ల గొప్ప మనసుకు  సలాం..!

September 9, 2017

 కన్నవాళ్ళను కూడా పట్టించుకోని కనికరం లేని సంతానం జమైన జమానలో వున్నాం మనం. కానీ అక్కడో, ఎక్కడో మానవత్వం అప్పుడప్పుడిలా పరిమళిస్తుంటుంది. ఖమ్మం నగరం వ్యవసాయ మార్కెట్లో పిల్లకోతిని రక్షించబోయి తల్లి కోతి చెట్టు మీది నుంచి క్రిందపడి మరణించింది. మనుషులు చచ్చిపోతేనే పట్టించుకోని దునియా.. కోతి చచ్చిపోతే పట్టించుకుంటుందా ? అంటే అవుననే అన్నారు ఖమ్మం రైతులు, కూలీలు. నలుగురి పొట్ట నింపడం కోసం రైతులు శ్రమిస్తారు, నలుగురి బరువును మోస్తూ బతుకుతుంటారు కూలీలు. అలాంటి వాళ్ళకు మానవత్వం గురించి చెప్పి, చదివించాల్సిన అవసరం లేదు. మానవత్వం వారి సహజ నైజం. వాళ్ళకు ఆ తడి తెలుసు కాబట్టి అది కోతి అని చూళ్ళేదు. దాని అకాల మరణానికి బాధపడి వూరుకోలేదు. మార్కెట్టుకు ఎటువంటి కీడు జరగ కూడదని.. స్థానికుల సహకారంతో ఆ కోతికి ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కోతి నిజంగా అదృష్టవంతురాలే.

మనుషులు చచ్చిపోతే సాటి మనుషుల తీస్కెళ్ళి బొంద పెడతారు. కానీ జంతువులు చచ్చిపోతే వాటిని పట్టించుకునే దిక్కు దివాణా ఉండదు. పాపం వాటి పీనుగులు అలా చెత్తల్లో, కుప్పల్లో కుళ్ళిపోతుంటాయి. మనుషులుగా పుట్టి జంతువుల కబేళరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించిన ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతులను, కూలీలను అభినందించాల్సిందే. వారి మానవతా దృక్పథానికి సలాం కొట్టాల్సిందే.