Monkeypox Declared Global Health Emergency By WHO Amid Rising Cases
mictv telugu

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌:WHO

July 24, 2022

కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడిన ప్రపంచదేశాలకు ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో కొత్త ముప్పు తయారైంది. ఇప్పటి దాకా 75 దేశాల్లో 16 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉందని WHO చీఫ్‌ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు.. అయితే.. యూరోపియన్ ప్రాంతంలో దీని ఇంపాక్ట్ కాస్త ఎక్కువే ఉందని అంచనా వేశారు. కొత్త విధానాల్లో ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించే ముప్పు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 5 మరణాలు సంభవించాయని, నిపుణుల కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వివరించారు. స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తోందని తెలిపారు.

ఇక‌.. మంకీపాక్స్‌ వైరస్‌పై పోరాటానికి ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవరసమని టెడ్రోస్ స్పష్టం చేశారు. మశూచి టీకాలు కొంత రక్షణ కలిగిస్తాయన్నారు. అయితే.. ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కొత్త టీకాలు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు బవేరియన్ నార్డిక్ తయారు చేసిన మశూచి వ్యాక్సిన్ ‘ఇమ్వానెక్స్’ను మంకీపాక్స్‌పై పోరాటానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ శుక్రవారం సిఫార్సు చేసింది. భారత్‌ ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వారిని పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీల్లో స్ర్కీనింగ్‌ చేస్తోంది. కేరళలో మూడు కేసులు బయటపడటం తో ఆ రాష్ట్రానికి కేంద్రం ఓ బృందాన్ని పంపింది.