రాష్ట్రంలో పసివాళ్లపై జంతువుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వరుసగా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వీధి కుక్కల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఒకవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు.. కోతులు కూడా చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో వెలుగు చూసింది.
ఊయలలో పడుకోబెట్టిన పసికందుపై కోతులు దాడి చేయగా కాలి బొటన వేలుకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు నెలన్నర పాప ఉంది. డెలివరీ అయ్యాక లావణ్య మోదుగులగూడెంలోని పుట్టింట్లో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం చిన్నారిని ఇంటి ఆవరణలోని ఊయలలో పడుకోబెట్టి నీళ్ల కోసమని ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో కోతులు ఒక్కసారిగా వచ్చి ఊయలలో ఉన్న పాపపై దాడి చేశాయి. పసికందు పెద్దపెట్టున రోదించడంతో లావణ్య పరుగెత్తుకొచ్చారు. కర్రతో వాటిని తరిమివేశారు. అప్పటికే కోతులు చిన్నారి కాలిబొటన వేలు కొరికివేశాయి. వెంటనే పసికందును మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించినట్లు తెలిసింది.