వర్షాకాలంలో ఇలా చేస్తే  జబ్బులు పరార్..  - MicTv.in - Telugu News
mictv telugu

వర్షాకాలంలో ఇలా చేస్తే  జబ్బులు పరార్.. 

August 6, 2019

Monsoon Diseases

మండువేసవి నుంచి చల్లని ఉపశమనాన్ని కలిగిస్తూ వర్షాకాలం వచ్చేసింది.ః ఈ కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పలు రకాల వ్యాధులు, జ్వరాలు సోకుతాయి. ముఖ్యంఈగలు, దోమలు వీరవిహారం చేస్తుంటాయి. అవి కుట్టడం వల్ల రకరకాల జబ్బులు వచ్చేస్తుంటాయి. అవి రాకుండా వుండాలంటే మన పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలి. వానలో తడవకుండా చూసుకోవాలి. ఈ నాలుగు నెలలు బయట తడిగా వుంటుంది. దీంతో వైరస్ ప్రబలుతుంది. జలుబు,  జ్వరం వంటివి ఎక్కువగా వస్తాయి. ఇవి చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా  ఐదారు రోజుల్లో తగ్గుతాయి. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లు తుడుచుకోవటంతో పాటు ప్యారాసెటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవాలి. ముఖ్యంగా నీరు, ద్రవాహారం ఎక్కువగా  తీసుకోవాలి.  లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. రక్కపరీక్షలు చేయించుకుని మలేరియా, టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే తదనుగుణంగా చికిత్స చేయించుకోవాలి.

 

మలేరియా..

Image result for malaria

అనాఫిలిస్‌ జాతికి చెందిన ఆడదోమలు కుట్టినప్పుడు మలేరియా సోకుతుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సరఫరా అవుతుంది. అందులో కూడా ఈ దోమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వ్యాధి కలిగిన రోగిని కుట్టిన దోమ రక్తం పీల్చుకుని.. ఇతర ఆరోగ్య వంతులను మళ్ళీ కుట్టినప్పడు వారికి 10 -15రోజుల తరువాత జ్వరం వస్తుంది. దోమ కుట్టటం ద్వారా రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు కాలేయాన్ని చేరుకుంటాయి. అనంతరం కాలేయంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లి సంతానాన్ని వృద్ధి చేస్తాయి.  అక్కడి నుంచి  రక్తప్రసరణలో కలిసి మలేరియా దాడి చేస్తాయి.

Image result for malaria

ఈ జ్వరం తీవ్రమైన చలితో ప్రారంభవుతుంది. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలి రావడం, చెమటలు పట్టడం ఉంటుంది. రోగిలో ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.

 

టైఫాయిడ్‌..

Image result for Typhoid

కలుషిత ఆహారం, నీటి ద్వారా టైఫాయిడ్ వ్యాపిస్తుంది.  దీనికి ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లోనే నివసిస్తుంది. టైఫాయిడ్‌ బారిన పడినవారు, దాని నుంచి కోలుకుంటున్న వారి రక్తం, పేగుల్లో ఈ బ్యాక్టీరియా  ఉంటుంది. 

ఈ జ్వరం 103 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది. విడవకుండా జ్వరం వుంటుంది. కొద్దిగా వాంతులు, విరేచనాలు అవుతాయి. ఆకలి మందగిస్తుంది. కలుషితమైన ఆహారం, నీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రోడ్ల పక్కన అమ్మే తిను బండారాలు, పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదు. రక్త పరీక్షల్లో టైఫాయిడ్‌ నిర్ధారణ అయితే యాంటీబయోటిక్‌ మందులు  వాడాలి.

డెంగీ..

Image result for dengue

ఆర్పోవైరస్‌ జాతికి చెందిన వైరస్‌ క్రిమి వల్ల డెంగీ జ్వరం వస్తుంది. ఈవైరస్‌ కంటికి కనిపించనంత అతి సూక్ష్మమైనది. ఈవైరస్‌ ఎయిడిస్‌ ఈజిస్ట్‌ జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్య వంతులకు సంక్రమిస్తుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ఈదోమలు కట్టిన తర్వాత 5నుంచి 8 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 
విపరీతమైన జనసాంద్రత, పారిశుధ్య లోపం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో ఈ రకమైన దోమలు ఎక్కువ అవుతాయి. ఇవి ఎక్కువగా పగటిపూట కుడతాయి.

అకస్మాత్తుగా వణుకుతో జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. నీరసం, నోరు చేదుగా, ఆకలి మందగించటం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కొంతమందిలో మొదటి రెండు రోజులు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. పైలక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందాలి. ఈవ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా.. శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా జాగ్రత్త పడాలి. 


డయేరియా (నీళ్ల విరేచనాలు)..

Image result for diarrhea


బ్యాక్టీరియా, వైరల్‌, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల వల్ల  డయేరియా (నీళ్ల విరేచనాలు) వస్తుంది . రోజుకి మూడు అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా భావించొచ్చు. సాధారణంగా ఇది రెండు మూడు రోజుల వరకు ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాంతులు విరేచనాలతో బాధపడే వారికి ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవాలి.

వాంతులు, విరేచనాలు అవుతుంటే.. మజ్జిగ, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ, పప్పునీళ్ల వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ను అరగ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి. ఎన్నిసార్లు విరేచనాలు అయితే అన్నిసార్లు ఓఆర్‌ఎస్‌ కలిపిన ద్రావణాన్ని తాగటం శ్రేయస్కరం. 

చికున్ గున్యా

Related image

డిస్‌ అనే దోమ ద్వారా చికున్ గున్యా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీనిని గునియా జ్వరము అని కూడా అంటారు. చలి జ్వరం, తలనొప్పి, వాంతులు, కీళ్ళ నొప్పులు వుంటే అది చికున్ గున్యా అని నిర్ధారణకు రావచ్చు. చికెన్ గున్యా జ్వరం లక్షణాలు కనిపించిన తక్షణమే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. కనీసం పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ల ట్యాంకులు, ఇతర నిల్వ పాత్రలపై మూతలు తప్పనిసరిగా ఉంచాలి. 

ఈ వ్యాధులన్నింటికి ముఖ్యంగా దోమలే కారణం. వాటి నివారణకు ఇంటి పరిసరాల్లో గుంతలు, గోతులు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే దోమలు విజృంభిస్తాయి. ఇంటిపైకప్పులో ఉన్న నీళ్ళట్యాంకులు, కూలర్స్‌ వంటి వాటిలో, నీటి తొట్టెల్లో దోమలు పెరగకుండా చూసుకోవాలి.  చేతులు కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. దోమల బారిన పడకుండా దోమతెరలు, రిపెలెంట్లు, కాయిల్స్‌, క్రీములు, లోషన్ల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. టెంకాయ చిప్పలు, పాత టైర్ల వంటి వాటిని దూరంగా పారేయాలి.