తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది జులై నెలలోనే భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ మూడు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.