ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం శుభవార్త.. నెలవారీ పెన్షన్‌కు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం శుభవార్త.. నెలవారీ పెన్షన్‌కు గ్రీన్ సిగ్నల్

July 5, 2020

Transgender

ట్రాన్స్‌జెండర్లకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలవారీ పింఛను ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) మంత్రి అశోక్ పాండా ప్రకటించారు. వికలాంగులు, నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టిన మధుబాబు పెన్షన్ యోజన(ఎంబీపీవై) కింద ఈ సంఘ సభ్యులను కవర్ చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదం తెలిపారని తెలిపారు. అందులోనే సుమారు 5వేల మంది ట్రాన్స్‌జెండర్‌లకు వారి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.900 వరకు పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించామని, లబ్ధిదారులకు త్వరలో సహాయం లభిస్తుందని మంత్రి తెలిపారు.

అధికార బీజేడీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందినవారు రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 5,000 మంది ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందుతారని ఆయన అన్నారు. ‘ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌ను ప్రజా సంఘాలు స్వాగతించాయి. కోవిడ్ -19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 48 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,000 అదనపు సహాయం అందించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మరికొన్ని రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్ సమాజం కోసం ఇలాంటి సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. గతంలో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు కూడా వారికి పెన్షన్లను ప్రకటించాయి’ అని మంత్రి పాండా వివరించారు.