More layoffs incoming: HP plans to layoff around 6000 employees globally in next few years
mictv telugu

6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న హెచ్‌పీ కంపెనీ!

November 23, 2022

అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. పని తీరు సరిగా లేదని గూగుల్ కంపెనీ కూడా తమ ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే దారిలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్ పీ సైతం 2025 మార్చి నాటికి 12 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకోనుంది. కంప్యూటర్ల విక్రయాలు క్రమంగా తగ్గుతున్న సమయంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మేరీ మైయర్స్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

2022లో అనేక సవాళ్లు 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతున్నాయిన మైయర్స్ అన్నారు. కంపెనీలో ప్రస్తుతం 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 4000 నుంచి 6000 మంది ఉద్యోగాల ఊడుతాయని తెలుస్తోంది. తొలగింపు వల్ల ఏఏ విభాగాలు ప్రభావితం అవుతాయో ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉంది. 2022 క్యూ3 ఫలితాల్లో పీసీ అమ్మకాలు 15.5 శాతం పడిపోయాయి. 2021 క్యూ3లో 17.3 మిలియన్ యూనిట్ల పీసీలను రవాణా చేసింది హెచ్‌పీ. ఈ ఏడాది అది 12.7 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలన్నది కంపెనీ ప్లాన్. ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్భణం ఇలా పలు దేశాల ఆర్థిక పరిస్థితులు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికా, యూరప్ లో ఆర్థిక మాంద్యం డిసెంబర్ చివరికి లేదంటే వచ్చే ఏడాది ఆరంభం నాటికి రావచ్చన్నది ఆర్థిక వేత్తల అంచనా.