అది దేశద్రోహమా? 49 మందికి మద్దుతుగా 180 మంది - MicTv.in - Telugu News
mictv telugu

అది దేశద్రోహమా? 49 మందికి మద్దుతుగా 180 మంది

October 9, 2019

  PM Modi......

ఇటీవల 50 మంది సినీ ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, మూకదాడులు పెరిగిపోతున్నాయంటూ..అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అపర్ణాసేన్, అనురాగ్ కశ్యప్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ సహా మొత్తం 50 మంది సినీ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జూలై నెలలో బహిరంగ లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకే 50 మంది సెలెబ్రిటీలు ప్రయత్నించారంటూ కొంత మంది బీహార్‌లోని ముజఫర్ నగర్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఆ 50 మందిపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలని ముజఫర్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 50 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.

తాజాగా బీహార్ పోలీసుల చర్యను ఖండిస్తూ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, అశోక్ వాజ్‌పేయి, జెర్సీ పింట్, టీఎం కృష్ణ సహా 180 మంది ప్రముఖులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 49 మంది రాసిన లేఖ రాజద్రోహం ఎలా అవుతుందని వీరు ప్రశ్నించారు. ఈ విధమైన వేధింపులను ఖండిస్తున్నామని, మా సహచరులు రాసిన లేఖలోని ప్రతి ఒక్క అక్షరాన్ని సమర్థిస్తున్నామన్నారు. ప్రజలను, ప్రముఖులను బాధ పెట్టేందుకు కోర్టులను దుర్వినియోగపరుస్తున్నారని దుయ్యబట్టారు. అయితే బీహార్ పోలీసులు మాత్రం 49 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని తేలిగ్గా తీసుకున్నారు. తాము ఇంకా కోర్టులో ఈ కేసు తాలూకు ఫైల్ దాఖలు చేయలేదని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ ప్రమేయం లేదని చేతులు దులుపుకుంది. ‘దీనికి బీజేపీతో గానీ, ప్రభుత్వంతో గానీ సంబంధం లేదు. మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికే ఈ ప్రయత్నం’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు.