డాక్టర్ నిర్వాకం..400 మంది చిన్నారులకు హెచ్ఐవి - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్ నిర్వాకం..400 మంది చిన్నారులకు హెచ్ఐవి

May 17, 2019

రోగాలనుండి ప్రజలను కాపాడాల్సిన వైద్యుడే 400 మంది చిన్నారులకు అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవి వైరస్ సోకేలా చేశాడు. ఈ దారుణం పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. దీంతో సదరు డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ముజఫర్ గంగర్ సిరంజీలు అందుబాటులో లేకపోవడంతో ఒకే సిరంజీని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో దాదాపు 400 మంది చిన్నారులకు అదే సిరంజీని ఉపయోగించాడు.

దీంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. హెచ్ఐవీ కేసులు బయటపడటంతో ఈ ఆసుపత్రి పరిధిలో చికిత్స పొందిన ప్రజలందరికీ అధికారులు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ దారుణానికి కారకుడైన వైద్యుడు ముజఫర్‌కు కూడా ఎయిడ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ అంశమై ముజఫర్ స్పందిస్తూ..‘నాకు హెచ్‌ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజిని వాడానని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం’ అని స్పష్టం చేశాడు. కాగా, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాకిస్థాన్ అధికారులు కోరుతున్నారు.