మసీదు కోసం 5 ఎకరాలు.. అయోధ్యలో కాదు, 25 కి.మీ అవతల  - MicTv.in - Telugu News
mictv telugu

మసీదు కోసం 5 ఎకరాలు.. అయోధ్యలో కాదు, 25 కి.మీ అవతల 

February 5, 2020

అయోధ్యలో రామమందిర నిర్మాణ కోసం ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోది ఈ రోజు పార్లమెంటులో ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదు స్థలంపై సంచలన ప్రకటన చేసింది. అయోధ్యలో కాకుండా అక్కడికి  25 కి.మీ. దూరంలోని ధనిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించింది. ఈమేరకు కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. 

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామమందిరం కోసం ఇవ్వాలని, అయోధ్య ప్రాంతంలో మరో చోట మసీదుకు 5 ఎకరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించడం తెలిసిందే. దీంతో మసీదు కోసం.. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాలను కేటాయించారు. ఈ స్థలం అయోధ్య జిల్లాలోని సొహావాల్ తహశీల్‌లో ధనిపూర్ గ్రామంలో ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం ఫైజాబాద్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, హైవేకు దగ్గరల్లో  గ్రామం ఉంది. అయోధ్యకు చుట్టుపక్కల ఉన్న ‘చార్ కోసి పరిక్రమ’ స్థలాలకు అవతల మసీదుకు స్థలం కేటాయించాలని సాధువులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ధనిపూర్ లో స్థలం కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి.