బస్టాండు కాదు, మసీదు.. కూల్చేస్తామంటున్న బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

బస్టాండు కాదు, మసీదు.. కూల్చేస్తామంటున్న బీజేపీ

November 14, 2022

కర్ణాటకలో మత అంశాలపై రోజుకో వివాదం ముదురుతోంది. హిజాబ్, పాఠ్యపుస్తకాల్లో సావర్కర్ పాఠంపై వివాదం తాజా ఉదాహరణలు. మరింత తాజాగా ఓ బస్టాండుపై గొడవ జరుగుతోంది. దాన్ని మసీదు శైలిలో నిర్మించారని, చర్యలు తీసుకోకపోతే కూలగొడతామని అధికార పార్టీ బీజేపీ హెచ్చరిస్తోంది. మైసూర్ నుంచి ఊటీ వెళ్లే దారిలో ఉన్న ఆ మసీదు గొడవ మీడియాకు ఎక్కడంతో కలకలం రేగుతోంది. దాన్ని కట్టిన అధికారులే కూల్చేయాలని లేకపోతే తాము కూలగొడతామని మైసూర్-కొడుగు ఎంపీ ప్రతాప్ సింహా హెచ్చరించారు. ఆ కట్టడం పైకప్పు పైన మూడు గుమ్మటాలు పెట్టారని,

అది ముమ్మాటికీ మసీదేనని ఆయన అన్నారు. నాలుగు రోజుల్లోగా దాన్ని పడగొట్టకపోతే జేసీబీతో తానే కూల్చేస్తానని హెచ్చరించారు. మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పాఠశాలలకు కషాయ రంగు పూయడం వివాదానికి దారితీసింది. పాఠ్యపుస్తకాలను ఇష్టమొచ్చినట్లు మారుస్తూ అన్నీ కాషాయమయం చేస్తున్న కమలనాథులు చివరికి పాఠశాలలను కూడా వదలడం లేదని విపక్షాలు మండిపడున్నాయి. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. కాషాయం జాతీయ జెండాలోనే ఉందని, కాంట్రాక్టు తీసుకున్న ఆర్టిటెక్టే ఆ రంగు కొట్టించాలని నిర్ణయం తీసుకున్నారని సర్కారు నేతలు అంటున్నారు.