దోమకాటుతో కరోనా వ్యాపించదు - MicTv.in - Telugu News
mictv telugu

దోమకాటుతో కరోనా వ్యాపించదు

March 26, 2020

Mosquitoes are not carriers

కరోనా వైరస్‌ పుణ్యమా అని వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు చేతినిండా పని దొరికింది. ఎడ్డం అంటే తెడ్డం అన్న రేంజులో ఫేక్ వార్తలు క్రియేట్ చేయడం.. వాట్సాప్‌లో షేర్ చేయడం ఇదే పని అయిపోయింది వారికి. వాయిస్ మెసేజ్‌లు, మీమ్స్, టెక్స్ట్ మెసేజ్‌లు క్రియేట్ చేసి షేర్లు చేస్తున్నారు. దానికి మళ్లీ అలర్ట్ షేర్ అని జోడిస్తారు. అది ఫేక్ అని తెలిసినవాళ్లు దాన్ని అసలు పట్టించుకోరు కానీ, పాపం ఊళ్లల్లో ఉండే జనాలు వాటిని చదివి అనవసర భయాందోళనలకు గురి అవుతున్నారు. దీనిమీద ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఫేక్ వార్తలు నమ్మవద్దు అని.. కరోనా గురించి మేము చెప్పేవే నమ్మండి అని చెప్పింది. అయినా వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. 

లాక్‌డౌన్ జూన్ 1 వరకు కొనసాగుతుందని.. ఆపై మరో నెల కూడా పొడిగించవచ్చని ఓ వాయిస్ మెసేజ్ వాట్సాప్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది విని ఇప్పటికే చాలామంది ‘వామ్మో అన్ని రోజులైతే బతికేది ఎలా?’ అని ప్రశ్నించుకుంటున్నారు?? ఇదిలావుండగా దోమకాటు వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం ఊపు అందుకుంది. దీంతో ప్రజలు మరింత అభద్రతా భావంలోకి పడిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. మందు తాగడం వల్ల, వెల్లుల్లి తినడం వల్ల కరోనా రాకుండా అడ్డుకోలేమని తెలిపింది. కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుష్ప్రచారాల మీద సైబర్ క్రైమ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఇలాంటి విష ప్రచారం మానుకోవడంలేదు.