దోమను దోమతోనే కోశారు.. డెంగీ దోమకు ‘మానవ దోమ’తో చెక్.. - MicTv.in - Telugu News
mictv telugu

దోమను దోమతోనే కోశారు.. డెంగీ దోమకు ‘మానవ దోమ’తో చెక్..

January 18, 2020

Mosquitoes.

ముల్లును ముల్లుతోనే తియ్యాలి అన్నట్టు.. దోమను దోమతోనే సంహరించాలి అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాంటియాగో, వ్యాండర్‌బిల్ట్‌ వర్సిటీల శాస్త్రవేత్తలు. డెంగీ, మలేరియా వంటి వైరస్‌లను వ్యాప్తి చేస్తూ పబ్బం గడుపుకుంటున్న దోమల అంతానికి శాస్త్రవేత్తలు ముల్లు సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. వాటి సంహారానికి కొత్త దోమలను సృష్టించారు. మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలను జన్యు ఇంజినీరింగ్‌ విధానంలో సృష్టించారు. డెంగీ వైరస్‌కు లొంగని విధంగా దోమల్లో జన్యుపరమైన మార్పులు(జీఎం) చేశారు. 

ఇవి ఎలా సృష్టించారో పరిశోధనకులు తెలిపారు. ‘ఆడ ఏడిస్‌ ఏజిప్టి దోమలతో డెంగీ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ‘కార్గో’ అనే మనుషుల యాంటీబాడీని దోమల్లోకి చొప్పించాం. దీంతో వాటి శరీరంలో అది క్రియాశీలమై, డెంగీ వైరస్‌లు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు గుర్తించాం. ఈ కొత్త రకం దోమలు.. ఒకవేళ డెంగీ రోగుల రక్తాన్ని పీల్చితే, వాటిలోని మానవ యాంటీబాడీ క్రియాశీలకంగా మారి వైరస్‌ ప్రభావానికి లొంగకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్‌లను కూడా అడ్డుకునే దిశగా మా ఈ పరిశోధన కీలకం కానుంది’ అని పరిశోధకులు వెల్లడించారు.

Mosquitoes

కాగా, డెంగీ రోగులను దోమ కుట్టినప్పుడు, దానిలోకి డెంగీ వైరస్‌ ప్రవేశిస్తుంది. మళ్లీ అదే దోమ ఆరోగ్యవంతులైన వ్యక్తులను కుడితే వారికీ డెంగీ సోకుతుంది. ఇలా డెంగీ వ్యాప్తి చెందుతుంది. డెంగీ రోగులను దోమ కుట్టినప్పటికీ అది వైరస్‌ బారినపడకుండా ఉండగలిగేలా దోమల్లో మార్పులు చేయాలన్న ఆలోచనతో ఈ కొత్త దోమలను సృష్టించాం అంటున్నారు పరిశోధకులు.