పాత నగరం మునిగిపోతోందని కొత్తది నిర్మిస్తే….అక్కడ దోమలు చంపేస్తున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు ఇండోనేషియా కొత్త రాజధానివాసులు. దోమలతో సహవాసం చాలా కష్టం మహాప్రభో….వాటిని నివారించండి అని మొరపెట్టుకుంటున్నారు.
ఇండోనేషియా సముద్రం ఒడ్డున ఉంటుంది. అసలు చెప్పాలంటే ఇది ఒక దీవుల సముదాయం. అలాగే అటవీ ప్రాంతం కూడా. దీని రాజధాని జకార్తా. ఇది కూడా జావా అనే ద్వీపంలో ఉంది. ఇక్కడ కోటిన్నరకు పైగా జనాభా ఉంటున్నారు. కాకపోతే జకార్తా రోజురోజుకూ కుంగిపోతోంది. ఎంత అంటే సముద్రం మట్టం కంటే కిందకి దిగిపోతోంది. దీంతో కొంత నగరం సముద్రంలో కలిసిపోయింది. వాతావరణ మార్పులు ఇందుకు కారణం.
మరోవైపు భూగర్భ జలాలను కూడా అక్కడ పూర్తిగా తోడేస్తున్నారు. అక్కడ వానలు బాగానే పడతాయి. కానీ ఆ నీటిని సంరక్షించేందుకు సరైన ఏర్పాట్లు మాత్రం చేసుకోలేదు. దాంతో నీళ్ళు లేక భూగర్భ జలాలను బోర్లతో తోడేస్తున్నారు. నగరం దిగిపోవడానికి ఇది కూడా ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అందుకే కొన్నేళ్ళ క్రితమే కొత్త రాజధాని ఏర్పాట్లను చేపట్టారు.
రాజధాని నిర్మాణం మొదలైంది. శరవేగంతో పనులు జరుగుతున్నాయి కూడా. బిలియన్ డాలర్ల డబ్బును కూడా ఖర్చు పెడుతున్నారు. 2024 కల్లా దీన్ని పూర్తిచేయాలనుకుంటున్నారు. అయితే ఈ కొత్త రాజధాని ఉష్ణమండలం అటవీ ప్రాంతంలో ఉంది. బాగా చెట్లు ఎక్కువ ఉండే అడవిని నిర్మూలించి రాజధాని కడుతున్నారు. దాంతో అడవిలి ఉండే దోమలు ఇప్పడు నివాసప్రాంతాల్లోకి వస్తున్నాయి. దీంతో దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దోమలు ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు ఉంటాయి. 2045కి ఈ కొత్త రాజధానిలో రెండు కోట్ల మంది నివసిస్తారని అంచనా. అలాంటప్పుడు ఇలా దోమలు ఉంటే బతకడం కష్టం అయిపోతుందని జనాలు ఏడుస్తున్నారు. ఇప్పటి నుంచే దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు.