ఎట్టకేలకు మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది. నిన్నంతా అదే ఆనందంలో మొత్తం భారతదేశం అంతా తలమునకలైంది. ఒకరోజు గడిచిపోయింది. విషయం పాతబడిపోయింది అనుకుంటున్నారా….అబ్బే అస్సలు లేదు. ఇంకా ఆస్కార్ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. ఆ ఫంక్ష్ తాలూకా లెక్కలు, గొప్పలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అందులో మేజర్ పార్ట్ మన సినిమా, మన నటులే అవుతున్నారు కూడా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆస్కార్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఆస్కార్ వేడుకలో మోస్ట్ మెన్షన్డ్ మేల్స్ జాబితాలో మన బుడ్డోడు ఫస్ట్ ప్లేస్ కొట్టేసాడు. హాలీవుడ్ యాక్టర్లను కూడా తోసిరాజనేసి గ్లోబల్ ఐకాన్ గా నిలిచాడు.
ఆస్కార్ రావడం కాదు కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ గాల్లో తేలిపోతున్నారు. అవార్డు తమకు రాకపోయినా తాము పని చేసిన టీమ్ కు రావడంతో వారు ఆనందంలో తలమునకలవుతున్నారు.దీనికి తోడు ఊహించని పేరు ప్రతిష్టలు కూడా వాళ్ళ సొంతం అవుతున్నాయి. 95వ అకాడమీ అవార్డుల వేడుకలో గ్లోబల్ ఐకాన్ సోషల్ మీడియాలో “మోస్ట్ మెన్షన్డ్ మేల్స్” జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలిచాడు.
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులు చేసిన ట్వీట్లు కూడా ఆస్కార్స్లో ఎన్టీఆర్ ప్రెజెన్స్ కి నిదర్శనంగా నిలిచాయి. ఇదొక్కటే కాదు రెండవ స్థానం కూడా మనోడిదే. ఎన్టీయార్ తర్వాత సెకండ్ ప్లేస్ లో రామ్ చరణ్ నిలిచాడు. వీళ్ళిద్దరి తర్వాత స్థానాలు బ్రెండన్ ఫ్రేజర్, పెడ్రో పాస్కల్, కే హుయ్ క్వాన్ లు దక్కించుకున్నారు.ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయం. జూనియర్ ఎన్టీఆర్ తన దైన డ్రెస్సింగ్ తో అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. పులి బొమ్మతో డిజైన్ చేసిన బ్లాక్ కుర్తాలో ఎన్టీయార్ మెరిసిపోయాడు.
ఇంకోవైపు సోషల్ మీడియాలో , న్యూస్ మీడియాలో అత్యధికసార్లు ప్రస్తావించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. దీని తర్వాత ది ఎలిఫంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ల విషయానికి వస్తే మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలాజిబెత్ ఓలెన్స్, జైమి లీ కర్టిస్ లు ఉన్నారు.
ఇక 95వ ఆస్కార్ వేడుకలను ప్రపంచం మొత్తంలో 18.7 మిలియన్ మంది చూశారుట. ఈ ఈవెంట్ ను ప్రసారం చేసిన ఏబీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈవెంట్ ను చూసినవారి సంఖ్య 12 శాతం పెరిగిందని తెలిపింది. ఆస్కార్ వేడుక మొదలైన తర్వాత హెచ్బీవో, హెచ్బీవో మ్యాక్స్ లలో ప్రసారమైన వి లాస్ట్ ఆఫ్ అజ్ ఫినాలేను 8.2 మిలియన్ల మంది వీక్షించారు.