తల్లిప్రేమ పాడుగాను.. కొడుకు కోసం 35 అడుగుల సొరంగం తవ్వి..  - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిప్రేమ పాడుగాను.. కొడుకు కోసం 35 అడుగుల సొరంగం తవ్వి.. 

August 4, 2020

Mother, 51, faces jail after audacious attempt to single-handedly dig a 35ft-long tunnel to free her murderer son from prison in Ukraine.

కన్నబిడ్డ కోసం ఏ తల్లి అయినా ఎంతకైనా తెగిస్తుంది. తన బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి ఏమైనా చేస్తుంది. తన బిడ్డ మంచివాడా, చెడ్డవాడా అన్న పట్టింపులు తల్లికి ఉండవు. అయితే కొందరు తల్లులు మాత్రం సమాజానికి కీడు చేసే కొడుకులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని కోరుతుండటం చూస్తున్నాం. అయితే ఈ తల్లి మాత్రం జైల్లో శిక్ష అనుభవిస్తున్న కొడుకును తప్పించడానికి చాలా పెద్ద రిస్క్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 అడుగుల సొరంగమే తవ్వేసింది. ఒకటి రెండు అడుగుల గుంత తవ్వడానికే కిందామీదా అవుతాం.. అలాంటిది ఆమె మాత్రం అన్నేసి అడుగులు తవ్విందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇదంతా కేవలం కొడుకు కోసమే చేసింది.. ఆ మాతృత్వమే ఆమె చేత ఆ పని చేయించింది. అయితే చేసే పని ఏదైనా దాని ఉద్దేశ్యం మంచిదైతే ఏ సమస్యా ఉండదు. ఈ తల్లి విషయంలో అదే జరిగింది. ఉక్రెయిన్‌లోని జఫోరిజియా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తల్లి కుమారుడు ఓ నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన కొడుకును ఎలాగైనా జైలు నుంచి విడిపించుకోవాలని ఆ తల్లి తాపత్రయపడింది. 

ఈ విషయమై ఓరోజు జైలుకు వెళ్లి కొడుకుని కలిసింది. కొడుకు ఆమెకు ఓ ప్లాన్ చెప్పాడు. అంతే ఆ మరుసటి రోజే జైలుకు సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. పగలంతా ఆ ఇంట్లోనే ఉంటూ రాత్రులు తన కర్తవ్య నిర్వహణలో తలమునకలై ఉండేది. జైలుకు సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి బైక్ మీద వెళ్లి సొరంగం తవ్వడం ప్రారంభించింది. అలా మూడు వారాలలో జైలు గోడ వరకు 35 అడుగుల సొరంగం తవ్వేసింది. అయితే ఆమె దురదృష్టవశాత్తు కొడుకును తప్పించే క్రమంలో ఆమె పోలీసులకు చిక్కింది. ఒకరోజు పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తుండగా సొరంగం తవ్వుతున్న ఆమెను పోలీసులు గుర్తించారు. ఆరా తీయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కొడుకు కోసం పాటుపడ్డ ఆ తల్లికి కోర్టు శిక్ష విధించింది.