Mother and son travelling story
mictv telugu

పుస్తకాలను చదివి ప్రయాణాలు చేస్తున్న తల్లీకొడుకులు

January 5, 2023

Mother and son travelling story

కేరళలో మొదలైన పర్యటన హిమాలయాలను చేరింది. ప్రపంచాన్ని చుట్టేయడం ఆమె కాంక్ష. భర్త ఉన్నంతవరకు ఇల్లే లోకంగా బతికిన ఆమెలో భ్రమణ కాంక్ష కలగడానికి కారణం ఆమె భర్త రాసిన పర్యాటక కథనాలేనంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అదే నిజం. అవే ఆమెను నడిపిస్తున్న శక్తులు.

ఆమె పేరు గీతా రామచంద్రన్. భర్త పేరు ఎం.కె. రామచంద్రన్‌. ఎం.కె రామచంద్రన్‌ పేరు తెలియని మలయాళ పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పర్యాటక కథనాలకు పెట్టింది పేరు ఎం.కె. రామచంద్రన్. ఆయన అత్యంత ఆసక్తికరంగా రాసిన కథనాల్లో ఉత్కంఠతో విహరించే వారు పాఠకులు. కేరళ, త్రిశూర్‌లో నుంచి హిమాలయాల వరకూ ఆయన ఎన్నో కథనాలు రాసారు. తపోభూమి ఉత్తరాఖండ్, ఆది కైలాస యాత్ర, ఉత్తరాఖండిలూడి – కైలాస్‌ మాన్‌సరోవర్‌ యాత్ర వంటి యాత్రాకథనాలను వెలువరించారాయన. 2003లో ప్రచురితమైన ఉత్తరాఖండిలూడి – కైలాస్‌ మాన్‌సరోవర్‌ యాత్ర రచనకు గాను ఎం.కె. రామచంద్రన్‌ 2005లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కానీ ఆయన సాధించిన ఈ ఘనతలో గీతారామచంద్రన్‌ సహపర్యాటకురాలు కాలేకపోయారు. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేస్తూ గృహిణిగానే జీవితంలో ఎక్కువ భాగం గడిచిపోయింది.

దేశంలోని ప్రతి వైవిధ్యతనూ భర్త స్వయంగా ఆస్వాదిస్తుంటే, ఆ వైవిధ్యతలోని అందాన్ని ఆమె ఆయన రచనల్లో ఆస్వాదించేవారు. పిల్లల బాధ్యత పూర్తయిన తర్వాత కావల్సినంత విరామం దొరికింది. డయాబెటిస్‌ రూపంలో ఆరోగ్యం ఒక సవాల్‌ విసిరింది. కానీ సరిగ్గా మెయింటెయిన్‌ చేస్తే డయాబెటిస్‌తో ముప్పు ఉండదని జవాబు ఇచ్చిందామె. భర్త రాసిన ప్రదేశాలతోపాటు రాయని ప్రదేశాల్లో కూడా పర్యటిస్తోంది. కొడుకు తోడుగా ఉండడంతో క్లిష్టమైన ప్రదేశాలకు కూడా ధైర్యంగా వెళ్లగలుగుతున్నానంటోంది గీతా రామచంద్రన్‌.

అరవై నిండిన వాళ్లకు తీర్థయాత్రల ప్యాకేజ్‌లుంటాయి. నేను నా భర్త రాసిన ప్రతి అక్షరాన్ని చదివాను, ఆ ప్రదేశాల గురించి చెప్పగలిగినంతగా చదివాను. వాటన్నింటినీ ఆసాంతం చూడాలి, ఆస్వాదించేవరకు అక్కడ గడపగలగాలంటే టూర్‌ ప్యాకేజ్‌లు కేటాయించే టైమ్‌ సరిపోదు. అందుకే సొంతంగా టూర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటాను. నా పిల్లల్లో శరత్‌కి పర్యటనలంటే చాలా ఇష్టం. నన్ను తనే తీసుకెళ్తాడు. ఒంటె మీద సవారీ చేయాలంటే చేయిస్తాడు, మంచులో నాతో కలిసి ఆడతాడు. బీచ్‌లో పరుగులు తీస్తాం. అడుగు జారుతుందేమోననే చోట చేయి పట్టి నడిపిస్తాడు అంటూ చెపుతున్నారు గీతా.

జైపూర్‌ లాంటి కొన్ని పర్యాటక ప్రదేశాల్లో సైకిల్‌ రైడింగ్‌కి అవకాశం ఉంటుంది. అక్కడ సైకిల్‌ మీద ఆ ఊరంతా తిప్పి చూపిస్తాడు. మనాలి నుంచి రోహతాంగ్‌ పాస్‌కు మోటార్‌ బైక్‌ మీద తీసుకెళ్ళాడు. బైక్‌ మీద టూర్‌ నాకదే మొదటిసారి. ఆ జర్నీ యూత్‌ఫుల్‌గా అనిపించింది. సిమ్లా, మనాలి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ సాగిన ఆ జర్నీలో అపాయకరమైన మలుపులను కూడా గమనించనేలేదు. క్లిష్టమైన మలుపుల్లో భయం వేయలేదా అని శరత్‌ అడిగే వరకు భయమనే మాటే గుర్తు రాలేదు. నేను టూర్‌ ప్లాన్ బాగా వేస్తానని మా శరత్‌కి గట్టి నమ్మకం అంటున్నారు. ప్రొఫెషనల్‌ టూర్‌ ఆపరేటర్‌లు కూడా అలా వేయలేరంటాడు. మా వారి రచనలు చదివాను, కాబట్టి నా అభిరుచికి తగినట్లు అక్కడ యాక్టివిటీస్‌ కోసం ఎంత సమయం అవసరం ఉంటుందో లెక్కవేసి ఆ రోజు బస ఇతర సమయాలను ప్లాన్‌ చేస్తుంటాను. మూడు నెలలకో టూర్‌ వేయకపోతే నాకు తోచదు. నాకే కాదు శరత్‌కి కూడా. నేను ఆలస్యం చేస్తే ‘అమ్మా నెక్ట్స్‌ ఎక్కడికి?’ అని అడుగుతాడు. కొత్త లోకాన్ని చూస్తున్నాననడం లేదు, కానీ లోకాన్ని కొత్తగా చూస్తున్నానని చెప్పవచ్చు. అక్షరాల్లో చదివి ఊహించుకున్న ప్రదేశాల్లో విహరించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి అని మాత్రం చెప్పగలను అంటున్నారు అరవై నాలుగేళ్ల గీతా రామచంద్రన్‌.

ట్రావెల్‌ ప్యాకేజ్‌లలో పంపిస్తే అమ్మ ఆరోగ్యం, భద్రత గురించి మాకు క్షణక్షణం ఆందోళనగానే ఉంటుంది. నేను తీసుకువెళ్తే ఆ భయం ఉండదు కదా! మా అమ్మ ముఖంలో సంతోషం చూస్తే పర్యటన కోసం కేటాయించిన సమయం, డబ్బు ఏ మాత్రం వృథా కాలేదని సంతృప్తిగా ఉంటుంది. ఆమెకు అంతటి సంతోషాన్నిస్తున్న పని చేస్తున్నందుకు కొడుకుగా గర్వపడుతున్నాను. మా బాల్యంలో నాన్న ఎప్పుడూ టూర్‌లలోనే ఉండేవారు. నాన్నకు కావల్సినవి అమర్చిపెట్టడం, మాకు ఏ లోటూ లేకుండా చూసుకోవడంతోనే అమ్మ జీవితం గడిచిపోయింది. అప్పటి ఆ లోటు ఇప్పుడు తీరుస్తున్నాను అని చెప్పుకొచ్చారు కొడుకు శరత్.

మొత్తానికి తల్లీకొడుకులు ఇద్దరూ భూమిని చుట్టేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఉదాహరణగా నిలుస్తూ…ఆనంద విహారం చేస్తున్నారు. భారతదేశం అంతా ఆల్మోస్ట్ తిరగం అయిపోయింది. ఇప్పడు విదేశాలను చూడాలని ప్లాన్ లు వేస్తున్నారు. రామచంద్రన్ విదేశాల గురించి పుస్తకాలు రాయలేదు…కానీ ఇన్నాళ్ళు చేసిన ప్రయాణాల ఎక్స్ పీరియన్స్, ఉత్సాహంతో స్కెచ్ లు వేసేస్తున్నారు గీతా.